ఏషియన్ నారంగ్ వారసురాలికి టైమ్స్ పవర్ 2024 అవార్డు
తాజాగా జాన్వీ నారంగ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ ప్రతిభావనికి ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు లభించింది.
By: Tupaki Desk | 27 April 2024 5:18 AM GMTతెలుగు చిత్రసీమలో మహిళల ప్రవేశం, సక్సెస్ గురించి ఇటీవల బోలెడంత చర్చ సాగుతోంది. ఈ వరుసలోనే ఇప్పుడు ఏషియన్ నారంగ్ కుటుంబం నుంచి ఒక ప్రతిభావని సినీపరిశ్రమలో ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ సృష్టికర్తలు, అలాగే సినీపరిశ్రమలో పంపిణీ, ఎగ్జిబిషన్ రంగంలో సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న నారాయణ్ దాస్ నారంగ్ కుటుంబం నుంచి మూడో జనరేషన్ ప్రతిభావంతురాలిగా జాన్వీ నారంగ్ పేరు మార్మోగుతోంది. జాన్వీ నారంగ్ తన కుటుంబం అన్ని వ్యాపార కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది. తన తాత నారాయణ్ దాస్ నారంగ్ .. తండ్రి సునీల్ నారంగ్ అడుగుజాడలను అనుసరించి, ఝాన్వీ నారంగ్ చాలా చిన్న వయస్సులోనే వినోద పరిశ్రమలోకి ప్రవేశించి, మేనేజ్ మెంట్ సహా క్రియేటివిటీ విభాగంలో తనదైన ఒరవడితో దూసుకెళుతున్నారు.
జాన్వీ నారంగ్ ఏషియన్ సినిమాస్ లో అనేక ఆవిష్కరణలకు సూత్రధారి. వారి మల్టీప్లెక్స్ చైన్ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, వారు ప్రొడక్షన్ ఎగ్జిబిషన్ వ్యాపారంలో కూడా చాలా చురుకుగా మారారు. వర్ధమాన వ్యాపారవేత్త జాన్వీ సాధించిన విజయాల నేపథ్యంలో అనేక అవార్డులను గెలుచుకున్నారు.
తాజాగా జాన్వీ నారంగ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ ప్రతిభావనికి ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు లభించింది. అతి పిన్న వయస్సులో ఆమె సాధించిన విజయాలు, కుటుంబ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న తన సంకల్పానికి దక్కిన గౌరవమిది. సృజనాత్మక బృందాలను సమీకరించడం.. వారి నుండి ఉత్పత్తి ఔట్ పుట్ ని రప్పించడం.. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి తుది ఉత్పత్తి అనుకున్న దానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వరకు ప్రతి బాధ్యతను జాన్వీ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. తాజా పురస్కారానికి నారంగ్ కుటుంబం హర్షాన్ని వ్యక్తం చేసింది. జాన్వీకి సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తతున్నాయి. ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన 'కుబేర' చిత్రం నిర్మాణ దశలో ఉంది.