కల్కి & కంగువ.. ఇది నిజమేనా?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా పాన్ ఇండియా మయం. మేకర్స్ తమ చిత్రాలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు
By: Tupaki Desk | 21 March 2024 10:53 AM GMTప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా పాన్ ఇండియా మయం. మేకర్స్ తమ చిత్రాలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఖర్చు ఎంతైనా వెనుకాడడం లేదు. అనుకున్న పాయింట్ ను అచ్చు గుద్దినట్లు చూపించాలని నిర్ణయించుకుని ముందుకెళ్తున్నారు. అందుకు నాన్ స్టాప్ గా కష్టపడుతూ ప్రేక్షకులకు మంచి అవుట్ పుట్ ఇవ్వడమే టార్గెట్ గా పని చేస్తున్నారు. ఇక హీరోలు కూడా అనేక షెడ్యూళ్లు కేటాయించి తమ రోల్స్ కు న్యాయం చేస్తున్నారు.
అయితే తాము రాసుకున్న స్టోరీ లైన్ యూనిక్ గా ఉండాలని ఫిక్స్ అవుతారు డైరెక్టర్లు. కథ రాసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా అదే కథతో సినిమా వస్తే.. ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిపోతుంది. కాబట్టి స్టోరీ కోసం కొన్ని నెలలపాటు కసరత్తులు చేస్తారు. అంతా ఓకే అనుకున్నాక కాస్టింగ్ కు కథ వివరిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఇదంతా తెలిసిన విషయమే అయినా.. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలు సినిమాల స్టోరీ లైన్ల మధ్య చిన్న చిన్న పోలికలు కనిపిస్తుంటాయి. దీంతో వాటిపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంటుంది. అయితే ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ స్టోరీకి, సూర్య కంగువ సినిమా కథకు పోలిక ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై నెటిజన్లు పెద్ద డిబేట్ పెడతారిక!
కల్కి మూవీ విషయానికొస్తే.. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. మే9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీలో శ్రీ మహావిష్ణువు అంశతో భూమి మీద పుట్టిన భైరవ (ప్రభాస్).. కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తారు.
అంటే మహాభారత కాలం (3102 బీసీ) నుంచి కలియుగం (2898 ఏడీ భవిష్యత్తు) వరకు సాగుతుందీ సినిమా. మొత్తం చిత్రంలో వివిధ యుగాలను చూపించనున్నారు నాగ్ అశ్విన్. మరోవైపు, కంగువలో 1678 లోని అత్యంత క్రూరమైన పోరాట యోధుడిగా సూర్య కనిపిస్తారు. ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయంతో భూమి మీదకు వచ్చి మళ్లీ తన లోకానికి వెళ్తారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో రిలీజ్ అవుతుందనుకున్నా.. ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు.
అయితే కల్కి, కంగువ చిత్రాల్లో బ్యాక్ డ్రాప్స్ పూర్తిగా వేరైనా.. మెయిన్ కాన్సెప్ట్ ఒకటేనని చెప్పవచ్చు. రెండు సినిమాల్లోని హీరోలు ప్రభాస్, సూర్య కంప్లీట్ డిఫరెంట్ రోల్స్, గెటప్స్ లో సందడి చేయనున్నారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీ కూడా ఇలాంటి స్టోరీతోనే వచ్చింది. అందులో క్రూరమైన రాజు భూమి మీదకు వచ్చి పూర్తి మారి మళ్లీ పైకి వెళ్తాడు. ఏదేమైనా కల్కి, కంగువ మూవీలు రిలీజయ్యాక అసలు విషయం తెలుస్తుంది.