భారత పారిశ్రామిక రంగానికి టైటాన్ రతన్ టాటా అస్తమయం!
అవును... ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త, భారత పారిశ్రామిక రంగానికి టైటాన్, మానవతావాది రతన్ టాటా... దాతృత్వంలో చెరగని గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు.
By: Tupaki Desk | 10 Oct 2024 4:02 AM GMTప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ గ్రహీత, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ (ఐసీయు) యూనిట్లో చికిత్స పొందుతూనే రాత్రి 11:30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో... దేశం మొత్తం కన్నీరు పెట్టుకుంటుంది!
అవును... ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త, భారత పారిశ్రామిక రంగానికి టైటాన్, మానవతావాది రతన్ టాటా... దాతృత్వంలో చెరగని గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
వాస్తవానికి రతన్ టాటా ఆరోగ్యం బాగాలేదని.. ఆయన ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని.. పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ సోమవారం వార్తలు హల్ చల్ చేశాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్వయంగా రతన్ టాటానే ఆన్ లైన్ వేదికగా స్పందించారు.
తన ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు అని అంటూ.. తన ఆరోగ్యం బాగానే ఉందని.. రెగ్యులర్ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లానని.. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా అవసారం లేదని.. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని అటు ప్రజలను, ఇటు మీడియాను కోరుతూ ఎక్స్ లో పోస్ట్ ద్వారా స్పష్టతనిచ్చారు.
అయితే బుధవారం ఆయన ఆరోగ్యం విషమించిందని వార్తలు వచ్చాయి.. ఈసారి ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని దృవీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు దర్శనమిచ్చాయి. ఈ సమయంలోనే బుధవారం రాత్రి రతన్ టాటా దివంగతులయ్యారు. ఈ విషయాన్ని తొలుత ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ప్రకటించారు.
అనంతరం.. ఓ అసాధారణ నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నాం.. టాటా గ్రూపును మాత్రమే కాకుండా, దేశ రూపురేఖలను మార్చిన వ్యక్తి రతన్ టాటా అని.. తనకు ఆయన మిత్రుడు, మార్గదర్శి, గురువు అని అంటూ.. ఆయన తనదైన ప్రత్యేకతలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించారని కొనియాడుతూ బాధాతప్త హృదయంతో ఈ విషయాన్ని ధృవీకరించారు తదుపరి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.