మైఖేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత... కారణం ఇదేనా?
కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ సోదరుడు.. జాక్సన్ 5 పాప్ గ్రూప్ సోదరులలో ఒకరైన టిటో జాక్సన్ (70) మరణించినట్లు యూఎస్ మీడియా నివేదించింది.
By: Tupaki Desk | 16 Sep 2024 10:45 AM GMTకింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ సోదరుడు.. జాక్సన్ 5 పాప్ గ్రూప్ సోదరులలో ఒకరైన టిటో జాక్సన్ (70) మరణించినట్లు యూఎస్ మీడియా నివేదించింది. అయితే... అతడి మరణానికి గల అధికారిక కారణం మాత్రం ఇంకా వెళ్లడించలేదు. తన సోదరుడు మైఖేల్ జాక్సన్ తరహాలోనే గుండెపోటుతో మృతి చెందారని అంటున్నారు!
అవును... మైఖేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ మరణించారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు టీజే, తాజ్, టారిల్ లో ఇన్ స్టా గ్రాం లో ఆదివారం పోస్ట్ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా... తమ ప్రియమైన తండ్రి, రాక్ & రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ ఇప్పుడు తమతో లేరని బరువెక్కిన హృదయాలతో ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఇది తమకు షాకింగ్ విషయమే కాదు.. అత్యంత హృదయ విదారకర విషయమని తెలిపారు. తమ తండ్రి ప్రతి ఒక్కరి గురించీ, వారి శ్రేయస్సు గురించి పట్టించుకునే అద్భుతమైన వ్యక్తి అని ఈ సందర్భంగా టిటో కుమారులు తెలిపారు. అయితే... తమ తండ్రి మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదని తెలుస్తోంది!
జాక్సన్ 5లో జాకీ, టిటో, జెర్మైన్, మార్లోన్, మైఖేల్ ఉండేవారనే సంగతి తెలిసిందే. 1970లో ఏబీసీ, ఐ వాంట్ యూ బ్యాక్, ఐ విల్ బీ దేర్ వంటి సూపర్ డూపర్ హిట్ పాటలను అందించింది. ఈ క్రమంలోనే 1997 లో రాక్ & రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ప్రవేశించింది ఈ సంగీత కుటుంబ సమూహం.
1953 అక్టోబర్ 15న జన్మించిన టిటో జాక్సన్... ఈ గ్రూప్ లో గిటార్ వాయించే నేపథ్య గాయకుడిగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనకారులలో ఒకడయ్యాడు. టిటో జాక్సన్ 2016లో టిటో టైం తో తొలి సోలో ప్రాజెక్టును విడుదల చేశాడు! 2017లో వన్ వే స్ట్రీట్ అనే పాటను విడుదల చేశాడు.
కాగా... మైఖేల్ జాక్సన్ తన 50ఏళ్ల వయసులో 25 జూన్ 2009న జాస్ ఏంజిల్స్ లోని ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.