బాలయ్య వర్సెస్ మాస్ మహారాజా దసరా బరిలో గెలిచేది ఎవరు?
అయితే అనూహ్యంగా ఈ సమరంలో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా మహారాజా రవితేజ ఢీ అంటే ఢీ అంటూ సమరానికి రెడీ అవుతున్నారు.
By: Tupaki Desk | 9 Oct 2023 9:32 AM GMTదసరాకు పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతోంది. ఎవరూ ఊహించని విధంగా అక్టోబర్‌లో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే అనూహ్యంగా ఈ సమరంలో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా మహారాజా రవితేజ ఢీ అంటే ఢీ అంటూ సమరానికి రెడీ అవుతున్నారు. బాలయ్య 'భగవంత్ కేసరి' సినిమాతో బరిలోకి దిగుతుండగా, రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో పోటీకి దిగుతున్నాడు. చాలా కాంగా వీరిద్దరి మధ్య రైవల్రీ నడుస్తోందనే పుకార్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో దసరాబరిలో ఒక రోజు తేడాతో బాలయ్య, రవితేజ పోటీకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది.
బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న రిలీజ్ అవుతుండగా, రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న బరిలోకి దిగుతోంది. ఈ రెండు సినిమాలు దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గతంలో ఎన్నడూ చేయని పాత్రలో బాలయ్య తండ్రిగా కనిపిస్తుండటం, పక్కా తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెబుతూ ఉండటంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు తగ్గట్టుగా టీజర్, ట్రైలర్ ఉండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
బాలయ్య మార్కు మాస్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటూనే అదిరిపోయే డైలాగ్‌లు, అర్థవంతమైన సందేశం ఉండటం కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది. అనిల్ రావిపూడి తన పంథాకు భిన్నంగా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా చేసిన ఈ సినిమాలో బాలయ్య తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించడం, శ్రీలీలకు బాబాయ్‌గా కనిపించడం, తనని మిలట్రీ ఆఫీసర్‌ని చేయాలనే లక్ష్యంతో ఉండటం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. బలమైన సందేశం నేపథ్యంలో ఈ మూవీని అనిల్ రావిపూడి రూపొందించారు.
రవితేజ సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' కూడా ఏ మాత్రం తక్కువ కాదు. స్టూవర్ట్ పురం గజదొంగగా పేరున్న టైగర్ నాగేశ్వరరావు జీవత కథ ఆధారంగా ఈ సినిమాని ఓ బయోపిక్‌గా తెరపైకి తీసుకొచ్చారు. దొంగల సిండికేట్‌తో పాటు పోలీస్ వ్యవస్థని ఛాలెంజ్ చేస్తూ జరగబోయే దొంగతనాన్ని ముందుగానే చెప్పి దొంగతనం చేసే 'టైగర్ నాగేశ్వరరావు' స్టోరీ ఆధారంగా తెరపైకొచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది. టైగర్ నాగేశ్వరరావు గురించి చాలా ఏళ్లుగా రక రకాల కథలు వింటున్నా పూర్తి స్థాయి కథని చూడాలని, అసలు అతను దొంగగా ఎందుకు మారాడు, రాబిన్ హుడ్ తరహాలో దేశ వ్యాప్తంగా సంచలనంగా ఎందుకు మారాడు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
టెక్నికల్‌గానూ, విజువల్స్ పరంగానూ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉండటంతో 'టైగర్ నాగేశ్వరరావు' టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు దళపతి విజయ్ నటించిన 'లియో' మూవీ కూడా బరిలోకి దిగుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ మాత్రం అశించిన స్థాయిలో బజ్‌ని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. విజయ్ సినిమా అంటే ఆ రేంజే వేరు..కానీ 'లియో' ట్రైలర్‌లో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఘట్టాలు 'విక్రమ్'ని తలపించాయే కానీ కొత్తగా అనిపించకపోవడంతో ట్రైలర్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.
ఎంత మిక్స్డ్ టాక్ ఉన్నా కానీ విజయ్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ అక్టోబర్ 19నే విడుదలవుతోంది. దీని వల్ల 'భగవంత్ కేసరి' ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే ట్రైలర్‌తో పాజిటివ్ టాక్‌ని దక్కించుకున్న 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'ల్లో ఎవరు దసరా విజేతగా నిలుస్తారో..ఎవరు బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుంటారో తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.