Begin typing your search above and press return to search.

2024 సీక్వెల్స్: 3 హిట్టు, 5 ఫట్టు!

ఈ ఏడాదిలో ఏకంగా అర డజను సీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తే, మరో మూడు పరాజయం చవిచూశాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2024 11:30 PM GMT
2024 సీక్వెల్స్: 3 హిట్టు, 5 ఫట్టు!
X

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా సినిమా హిట్టయిందంటే చాలు, వెంటనే దానికి కొనసాగింపుగా సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు. పార్ట్-1 సెట్స్ మీద వుండగానే పార్ట్-2 ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో సీక్వెల్స్, ప్రాంచైజీలు ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగులోనూ ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో ఏకంగా 8 సీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తే, మరో 5 పరాజయం చవిచూశాయి.

2024 మార్చిలో ధియేటర్లలోకి వచ్చిన క్రేజీ సీక్వెల్ ''టిల్లు స్క్వేర్''. రెండేళ్ల కిందట బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'డీజే టిల్లు' చిత్రానికి కొనసాగింపుగా రూపొందింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీలో అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా 'టిల్లు క్యూబ్' రానుందని మేకర్స్ ప్రకటించారు.

ఈ ఏడాది ప్రేక్షకాదరణ పొందిన మరో సీక్వెల్ మూవీ "మత్తు వదలరా 2". ఐదేళ్ల క్రితం వచ్చిన ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ సాధించిన 'మత్తు వదలరా' సినిమాకి రెండో భాగం ఇది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది.

లేటెస్టుగా థియేటర్లలోకి వచ్చిన అతి పెద్ద సీక్వెల్ "పుష్ప 2: ది రూల్". 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సెకండ్ పార్ట్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడమే కాదు, అత్యంత వేగంగా ₹500 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్ లో ఈ సీక్వెల్ ప్రభంజనం సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా 'పుష్ప 3: ది ర్యాంపేజ్' ను మేకర్స్ ప్రకటించారు.

ఇలా ఈ సంవత్సరంలో మూడు సీక్వెల్స్ బాక్సాఫీసు దగ్గర ఘన విజయాలు సాధించాయి. అదే సమయంలో మూడు డిజాస్టర్లు పడ్డాయి. 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గా వచ్చిన ''డబుల్ ఇస్మార్ట్'' మూవీ పాన్ ఇండియా వైడ్ గా తీవ్ర నిరాశ పరిచింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించారు. ఇక ఘోర పరాజయం చవిచూసిన మరో సీక్వెల్ "యాత్ర 2". ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది.

అలానే 'గీతాంజలి'కి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనే సినిమా వచ్చింది. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. రానా రోహిత్ హీరోగా 'ప్రతినిధి' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన 'ప్రతినిధి 2' చిత్రం నిరాశ పరిచింది. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన 'భామాకలాపం 2' సినిమా కూడా ఈ ఏడాదే వచ్చింది. 'భామాకలాపం' ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. దాని సీక్వెల్ మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

అయితే టాలీవుడ్ లో ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్స్ కి బ్రేక్స్ పడేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో జై హనుమాన్, హిట్-3, గూఢచారి-2, అఖండ 2: తాండవం, దేవర-2, కల్కి-2, సలార్-2, బింబిసార-2, పొలిమేర-3, పుష్ప-3, డీజే టిల్లు-3, మ్యాడ్ మ్యాక్స్, కార్తికేయ-3, ఆదిత్య 999 మ్యాక్స్, శతమానం భవతి-2, మంగళవారం-2, ఫలక్ నుమా దాస్-2, దాస్ కా ధమ్కీ-2, ఈనగరానికి ఏమైంది-2 వంటి దాదాపు 20 సీక్వల్స్ ప్రకటించబడ్డాయి. వాటిల్లో కొన్ని సినిమాలు వచ్చే ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి.