ఓ ఇంటివాడైన యాక్టర్ సుబ్బరాజు.. సైలెంట్ గానే..
పెళ్లిళ్ల సీజన్ కు తగ్గట్లే టాలీవుడ్ లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. రీసెంట్ గా డైరెక్టర్ క్రిష్ సెకెండ్ మ్యారేజ్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 27 Nov 2024 4:43 AM GMTపెళ్లిళ్ల సీజన్ కు తగ్గట్లే టాలీవుడ్ లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. రీసెంట్ గా డైరెక్టర్ క్రిష్ సెకెండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ జరిగినట్లు నిన్ననే నాగార్జున ప్రకటించారు. త్వరలోనే నాగచైతన్య, శోభితల వివాహ వేడుక జరగనుంది.
అదే సమయంలో తాజాగా నటుడు సుబ్బరాజు.. సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తాను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. పెళ్లి అనంతరం తన భార్యతో కలిసి బీచ్ లో దిగిన పిక్ ను పోస్ట్ చేశారు. అయితే తనకు పెళ్లి పై అస్సలు ఇంట్రెస్ట్ లేదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సుబ్బరాజు.. ఇప్పుడు 47 ఏళ్ల వయసులో సైలెంట్ గా వివాహం చేసుకోవడం విశేషమే.
ప్రస్తుతం సుబ్బరాజు దంపతుల ఫోటో.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అందులో కొత్త దంపతులు వధూవరుల గెటప్ లో చాలా సింపుల్గా కనిపించారు. అదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సుబ్బరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సుబ్బరాజు భార్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇక సుబ్బరాజు కెరీర్ విషయానికొస్తే.. భీమవరానికి చెందిన ఆయన.. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ ను బాగుచేయడానికి వెళ్లి.. ఆయన వద్దే పర్సనల్ అసిస్టెంట్ గా చేరారు. అలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖడ్గం మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ సినిమాలో చిన్న రోల్ ను పోషించారు.
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్, బిందాస్, గోల్కొండ హైస్కూల్, దూకుడు, పంజా, శ్రీమంతుడు, బాహుబలి 2 వంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు.
అలా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి అలరించారు సుబ్బరాజు. ఎక్కువగా విలన్ గానే కనిపించినప్పటికీ.. తన కామెడీతో తెగ మెప్పిస్తుంటారు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటివాడయ్యారు.