ఏఐపై టాలీవుడ్ లో ఎవరికీ ఆసక్తి లేదా?
ఇండియాలో టెక్నాలజీ బేస్ లో సినిమాలంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు విశ్వనటుడు కమల్ హాసన్.
By: Tupaki Desk | 7 Sep 2024 5:30 PM GMTఇండియాలో టెక్నాలజీ బేస్ లో సినిమాలంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు విశ్వనటుడు కమల్ హాసన్. టెక్నాల జీని అందిపుచ్చుకోవడలో అతడు నేటికి నెంబర్ వన్ లోనే కొనసాగుతున్నారు. టెక్నికల్ కాన్సెప్ట్ సినిమాలు చేయడం అంటే కమల్ కి విపరీతమైన పిచ్చి. శంకర్ తెరకెక్కించిన` రోబో` సినిమాని పొరపాటున రజనీ కాంత్ చేసారు గానీ..అందులో నటించాల్సింది కమల్ హాసన్ మాత్రమే.
కానీ ఆ పాత్రకి కమల్ కంటే..రజనీ అయితే బాగుంటుందని ఛాన్స్ అతనికి వెళ్లింది. వరల్డ్ వైడ్ జరిగే టెక్నాలజీ అప్ డేట్స్ మీద కమల్ కి మంచి గ్రిప్ సంపాదించడం అలవాటు. టెక్నాలజీ పరంగా కమల్ నేటి జనరేషన్ యువతతో గట్టి పోటీ పడతారు అన్నది వాస్తవం. వాళ్లకి తెలియని విషయాలు సైతం కమల్ కి ఎన్నో తెలుసు. అంతగా కమల్ హాసన్ అప్ డేట్ లో ఉంటారు.
తాజాగా కమల్ హాసన్ ఏఐ టెక్నాలజీ పై పట్టు సాధించేందుకు అమెరికా యూనివర్శిటీలో జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే. 90 రోజుల కోర్స్ ను కమల్ అక్కడ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏఐ జమానా నడుస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే కమల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో చేరారు. ఈ కోర్స్ ని ఇంతవరకూ ఏనటుడు కూడా నేర్చుకోలేదు. ఆ రకంగా కమల్ 69 ఏళ్ల వయసులోనూ రికార్డులోకి ఎక్కారు.
ఇక టాలీవుడ్ నుంచి సాంకేతితకు అందిపుచ్చుకోవడంలో ఎవరు ముందుంటారు? అంటే ఏ ఒక్క నటుడు ఉండరు అనే చెప్పాలి. ఇలాంటి విషయాల పట్ల టాలీవుడ్ హీరోలెప్పుడు ఆమడ దూరంలో ఉంటారు. అప్పుడప్పుడు టెక్నికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తారు తప్ప! వాటిలో అపార అనుభవం సంపాదించాలనే ఆసక్తి ఎవరిలోనూ కనిపించదు.
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున జనరేషన్ హీరోల్ని తీసుకుంటే వాళ్లలో బాలయ్య బెటర్. ఆయన 90 స్ లోనే `ఆదిత్య 369` అనే గొప్ప టెక్నికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసి తన అభిరుచుని చాటుకున్నారు. అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద సాహసం. కానీ బాలయ్య ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేయడం అన్నది గొప్ప విషయం. మిగతా హీరోలెవరు అలాంటి సినిమాలు చేయలేదు. సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ లో రానా `ఘాజీ`, లేటెస్ట్ గా ప్రభాస్ `కల్కి 2898` లాంటి సినిమాలు చేసారు.