ఇండస్ట్రీలో తడి తక్కువ తమాషా ఎక్కువా?
టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వక ముందే 100 కోట్ల వసూళ్ల పోస్టర్, 150 కోట్ల వసూళ్ల పోస్టర్, 200 కోట్ల వసూళ్ల పోస్టర్ అంటూ ఓ 300 కోట్ల పోస్టర్ వరకూ ఓ కొత్త ట్రెండ్ కొంత కాలం క్రితమే మొదలైంది.
By: Tupaki Desk | 25 Feb 2025 4:30 PM GMTటాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వక ముందే? 100 కోట్ల వసూళ్ల పోస్టర్, 150 కోట్ల వసూళ్ల పోస్టర్, 200 కోట్ల వసూళ్ల పోస్టర్ అంటూ ఓ 300 కోట్ల పోస్టర్ వరకూ ఓ కొత్త ట్రెండ్ కొంత కాలం క్రితమే మొదలైంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే చాలు భారీ ఓపెనింగ్స్ రావడంతో సినిమా రిలీజ్ అయిన నాలుగైదు రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రమంటూ ఓ పోస్టర్ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా రిలీజ్ అయ్యేది.
ఇది చూసిన జనాలు ఒకింత షాక్ అవ్వాల్సిన పరిస్థితి. బడ్జెట్ చూస్తే 50 కోట్ల లోపే ఉంటుంది. కానీ పోస్టర్ లో నాలుగు రోజులకే వందల కోట్లు అంటూ పోస్టర్లు వేయడం సంచలనంగా మారేది. ఓ హీరో సినిమా వంద కోట్లు నాలుగు రోజుల్లో రాబట్టిందంటే? ఆ తర్వాత మరో స్టార్ హీరో సినిమా ఆ వంద కోట్లను మూడు రోజుల్లో నే రాబట్టినట్లు పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యేవి. ఈ విషయంలో టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా మినహాయింపు కాదు.
అందరి సినిమాల విషయంలో ఒకేలా ఉండేది. అప్పట్లో అందంతా నిజమేనని జనాలు కూడా నమ్మేయా ల్సి వచ్చేది. ఆ తర్వాత అర్దమైంది అందంతా పెద్ద ట్రాష్ అని. హీరో ఇమేజ్ కోసం...మార్కెట్ లో పోటీ... వచ్చే సినిమా బిజినెస్ కోసం కొన్ని పీఆర్ టీమ్ లు ఇలా కొత్త బూటకపు ప్రచారానికి తెరతీసాయని కాల క్రమంలో అర్దమైంది. ఈ విషయాన్ని కొంత మంది తమిళ, తెలుగు నిర్మాతలు కూడా సమర్దించారు.
ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఓ నిర్మాత గా తాము కూడా బయటకు చెప్పుకోని పరిస్థితులు కొన్ని ఉంటాయని...వాటిని అర్దం చేసుకోవాల్సిందిగా అభ్యర్దించారు. తాజాగా సందీప్ కిషన్ కూడా కొన్ని అంశాలపై స్పందించడం కూడా చాలా సందేహాలకు తావిస్తుంది. ముఖ్యంగా వసూళ్ల పోస్టర్ల విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇండస్ట్రీలో తడి తక్కువ తమాషా ఎక్కువ అన్నట్లే ఉంది.