అంత మొండి ధైర్యం ఉన్న ఆర్జీవీ ఇలా చేశారేంటి?
అయితే ఈ ఎపిసోడ్స్ చూశాక.. ఆర్జీవీ అంటే ఇంతేనా? అదేనా అతడిలో ఉన్న ధైర్యం? ఒక సగటు మానవుడిలాగే ఆర్జీవీ కూడా స్పందిస్తున్నారు! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి
By: Tupaki Desk | 25 Nov 2024 4:08 PM GMTమాఫియా డాన్ అయినా.. రాజకీయ నాయకుడు అయినా.. తనకు ఎదురు తిరిగింది ఎంత పెద్ద మొనగాడైనా తలవొంచని ఒక్కడిగా పేరు తెచ్చుకున్నారు ఆర్జీవీ. ముక్కు సూటిగా ఉన్నదున్నట్టు మాట్లాడేస్తూ సైకలాజికల్ గేమ్ ఆడటంలో అతడిని కొట్టేవాళ్లే లేరు. తనపై ప్రత్యర్థులు లెక్కలేనన్ని పోలీసు కేసులు పెడుతూనే ఉన్నా అవేవీ పట్టించుకోని ధైర్యవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. అతడి వైఖరికి ధైర్యానికి ప్రత్యేకించి ఒక వర్గం ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా అతడిని విపరీతంగా ఆరాధిస్తారు.
చంద్రబాబు అయినా, పవన్ కల్యాణ్ అయినా.. దావూద్ ఇబ్రహీం అయినా.. లారెన్స్ బిష్ణోయ్ అయినా.. ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం ఆర్జీవీ సొంతం. అతడు 'వ్యూహం' సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చంద్రబాబు-పవన్- లోకేష్ త్రయంపై చేసిన కామెంట్ల గురించి తెలిసిందే. దీనిపై ఒంగోలు రూరల్ పలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం పోలీసులు విచారణ కోసం పిలవగా ఆర్జీవీ అదనపు సమయం కోరాడు. అది అతనికి మంజూరైంది. అదే క్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా మళ్లీ దాటవేశారు. దీంతో ఒంగోలు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. కానీ ఆర్జీవీ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. అటుపైనా తన లాయర్ ద్వారా రెండు వారాల తర్వాత వర్చువల్ ప్రశ్నను అభ్యర్థిస్తూ నోటీసు పంపాడు. ఇప్పటివరకూ ఆర్జీవీ నుంచి బహిరంగ ప్రకటనలేవీ లేవు.
అయితే ఈ ఎపిసోడ్స్ చూశాక.. ఆర్జీవీ అంటే ఇంతేనా? అదేనా అతడిలో ఉన్న ధైర్యం? ఒక సగటు మానవుడిలాగే ఆర్జీవీ కూడా స్పందిస్తున్నారు! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్జీవీలో మునుపటి ధైర్యం ఎక్కడికి పోయింది? అంటూ నెటిజనులు డిబేట్లు పెట్టి మరీ వాదిస్తున్నారు. అతడు ఈ క్లిష్ఠ సన్నివేశాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం లేదు. ఒక సామాన్యుడిలాగే డీలా పడిపోతున్నాడు! అని కామెంట్ చేస్తున్నారు. ధైర్యానికి, సాహసానికి మారు పేరుగా ఉండే ఆర్జీవీ ఎందుకిలా దాక్కుంటున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు! ఈ ప్రశ్నలకు ఆర్జీవీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.