Begin typing your search above and press return to search.

దర్శకులను గడప దాటనివ్వట్లేదుగా..

టాలీవుడ్‌లో కొందరు దర్శకులు ఒకే నిర్మాణ సంస్థకు పరిమితం అవుతున్నారు. గతంలో ఒక హిట్ ఇచ్చాక ఇతర బ్యానర్లకు వెళ్లే అవకాశం ఉండేది.

By:  Tupaki Desk   |   8 Feb 2025 3:50 AM GMT
దర్శకులను గడప దాటనివ్వట్లేదుగా..
X

టాలీవుడ్‌లో కొందరు దర్శకులు ఒకే నిర్మాణ సంస్థకు పరిమితం అవుతున్నారు. గతంలో ఒక హిట్ ఇచ్చాక ఇతర బ్యానర్లకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిర్మాతలు ముందు నుంచే అడ్వాన్స్‌లు ఇచ్చి దర్శకులను తమ దగ్గరే బంధించేస్తున్నారు. కొంతమంది దర్శకులు ఇదే కంఫర్ట్‌లో సినిమాలు చేస్తుండగా, మరికొందరికి బయటకు వెళ్లే మార్గమే కనిపించడం లేదు. దర్శకులను లాక్ చేసే ఈ స్ట్రాటజీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

త్రివిక్రమ్‌ని తీసుకుంటే, 2012లో వచ్చిన జులాయి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన చేసే ప్రతి సినిమా హారిక & హాసిని క్రియేషన్స్‌కి చెందినదే. పవన్ కళ్యాణ్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కిన ఆయన ప్రతీ సినిమా ఇదే బ్యానర్‌లోనే రూపొందింది. ఇతర నిర్మాతలకు ఆయన పూర్తిగా అందుబాటులో లేరు. ఇదే విధంగా అనిల్ రావిపూడి కూడా దిల్ రాజు బ్యానర్‌కి పరిమితం అయ్యాడు. పటాస్ తర్వాత వచ్చిన ఆయన సినిమాల్లో ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లోనే ఉన్నాయి. 8 సినిమాల్లో 6 సినిమాలు ఇదే బ్యానర్‌లో చేయడం గమనార్హం.

తాజాగా మరో స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలో ఫిక్స్ అయ్యాడు. లవ్ స్టోరీ తర్వాత ధనుష్‌తో కుబేరా సినిమా కూడా అదే బ్యానర్‌లో చేస్తున్నాడు. ఇటీవలి సమాచారం ప్రకారం మరో సినిమా కూడా ఇదే సంస్థలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా తండేల్ తర్వాత చందూ మొండేటి మరోసారి గీతా ఆర్ట్స్‌లోనే సినిమా చేయబోతున్నాడు. దీని వల్ల బయట ప్రొడక్షన్ హౌస్‌లు వీరి క్యాలెండర్‌లో స్పేస్ దొరకదనే ఫీలింగ్‌కు వచ్చాయి.

ఇక రంగస్థలం నుంచి సుకుమార్ పూర్తిగా మైత్రి మూవీ మేకర్స్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. పుష్ప రెండు భాగాలు ఇదే బ్యానర్‌లో వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్‌తో మరో భారీ సినిమా కూడా ఇదే బ్యానర్‌లోనే లైన్లో ఉంది. దీంతో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్‌ను పూర్తిగా లాక్ చేసేసినట్టే. ఇదే తరహాలో సందీప్ రెడ్డి వంగా కూడా టీ-సిరీస్‌తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కబీర్ సింగ్, యానిమల్ తర్వాత స్పిరిట్ కూడా ఇదే బ్యానర్‌లో చేయనున్నాడు. అంతేకాదు, అల్లు అర్జున్‌తో ప్లాన్ చేస్తున్న సినిమా కూడా అదే సంస్థలోనే రూపొందనుంది.

ఇటువంటి పరిస్థితుల వల్ల మిగతా నిర్మాతలు స్టార్ డైరెక్టర్లను అప్రోచ్ చేయాలంటే చాలా కష్టం అవుతోంది. అయితే, ఒకే బ్యానర్‌లో పనిచేయడం వల్ల దర్శకులకు ఓ స్థిరత ఉంటుంది, వారు పూర్తిగా కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అలాగే అడిగినంత రెమ్యునరేషన్ లేదంటే బిజినెస్ లో షేర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కానీ, ఇది కొత్త ఆఫర్లు అందుకునే అవకాశాలను తగ్గిస్తుందనే టాక్ ఉంది. టాలీవుడ్‌లో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారుతుందా? లేకపోతే ఇది తాత్కాలికమా? అనేది చూడాలి.