Rewind 2024: ఈ ఏడాది ఆ హీరోలకు బాగా కలిసొచ్చింది!
2024 సంవత్సరం కొందరు టాలీవుడ్ హీరోలకు కలిసొస్తే, మరికొందరికి నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు, యంగ్ స్టర్స్ కు మాత్రం ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి
By: Tupaki Desk | 13 Dec 2024 3:30 AM GMT2024 సంవత్సరం కొందరు టాలీవుడ్ హీరోలకు కలిసొస్తే, మరికొందరికి నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు, యంగ్ స్టర్స్ కు మాత్రం ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. తేజ సజ్జా, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి యువ హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తే.. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్న సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు ఈ ఇయర్ మంచి విజయాలు అందుకున్నారు.
తేజ సజ్జా:
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ''హను-మాన్'' సినిమాతో యంగ్ హీరో తేజ సజ్జా సెన్సేషనల్ సక్సెస్ రుచి చూసాడు. సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలో రిలీజైన ఈ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ.. అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తీస్తే, ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు పోటీలో ఉన్నప్పటికీ.. డామినేషన్ చూపించింది. మైథలాజికల్ కంటెంట్ కు కాస్త సింపతీ కూడా తోడవ్వడం ఈ సినిమాకి కలిసొచ్చింది. నార్త్ లో హనుమంతుడి ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అయింది. దీనికి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని ప్రకటించారు. తేజ ప్రస్తుతం 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
సిద్ధూ జొన్నలగడ్డ:
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ డైరెక్షన్ లో రూపొందిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ ''టిల్లు స్క్వేర్''. ఇది రెండేళ్ల కిందట బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'డీజే టిల్లు' చిత్రానికి క్రేజీ సీక్వెల్. దీనికి సిద్ధూ స్వయంగా కథ అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. మార్చిలో విడుదలైన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 135 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీలో 'టిల్లు క్యూబ్' సినిమా కూడా వస్తుందని మేకర్స్ ప్రకటించారు. సిద్ధూ ఇప్పుడు 'జాక్' 'తెలుసు కదా' వంటి మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు.
నాని:
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు నెలాఖరున పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని రూ.100 కోట్ల వసూళ్ల మార్క్ ను టచ్ చేసింది. ఈ జోష్ లో నాని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టాడు. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'హిట్: ది థర్డ్ కేస్'.. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో 'పారడైజ్' చిత్రాల్లో నటిస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం:
యువ హీరో కిరణ్ అబ్బవరం తన స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా 'క'. ఇందులో నయన్ సారిక, తన్వి రామ్ కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ చివర్లో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. తెలుగు, మలయాళ భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో 2024లో హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు రాబట్టిన టాప్-10 తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో 'క 2' చిత్రాన్ని ప్రకటించారు. అలానే 'K ర్యాంప్' అనే టైటిల్ తో కిరణ్ త్వరలోనే తన కొత్త చిత్రాన్ని ప్రకటించబోతున్నాడు.
సందీప్ కిషన్:
సందీప్ కిషన్ ఈ ఏడాది ఒక తెలుగు సినిమా, రెండు డబ్బింగ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. తమిళ హీరో ధనుష్ తో కలిసి చేసిన 'కెప్టెన్ మిల్లర్' మూవీ పర్వాలేదనిపించుకోగా.. 'రాయన్' సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 160 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తెలుగులో వీఐ ఆనంద్ డైరెక్షన్ లో నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సందీప్ ఇప్పుడు త్రినాథరావు నక్కినతో 'మజాకా' అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ డెబ్యూ మూవీలో హీరోగా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
సుధీర్ బాబు:
సూపర్ స్టార్ అల్లుడు సుధీర్ బాబు ఈ ఇయర్ రెండు సినిమాలను విడుదల చేసారు. జ్ఞానశేఖర్ ద్వారకా దర్శకత్వంలో చేసిన 'హరోం హర' చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవరాల్ గా ఎబవ్ యావరేజ్ సినిమా అనిపించుకుంది. అలానే అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్ లో నటించిన 'మా నాన్న సూపర్ హీరో' మూవీ విమర్శకుల ప్రశంసలు అన్నదుకుంది. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో పెరఫార్మ్ చేయలేకపోయింది.
రితేశ్ రానా దర్శకత్వంలో 'మత్తు వదలరా' సీక్వెల్ గా తెరకెక్కిన 'మత్తు వదలరా 2' చిత్రంతో హీరో శ్రీ సింహా సూపర్ హిట్టు కొట్టాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల వరకూ గ్రాస్ రాబట్టింది. ఓవర్ సీస్ లోనే 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. గతేడాది 'మ్యాడ్' సినిమాతో మంచి హిట్టు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఈ ఏడాది 'ఆయ్' మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అందరూ కొత్తవాళ్లతో తీసిన 'కమిటీ కుర్రాళ్ళు' సినిమా మంచి హిట్టైంది.