Begin typing your search above and press return to search.

కోటి ఆశలతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన హీరోలు!

స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకూ ప్రతి ఒక్కరూ ఈసారి విజయం వరిస్తుందని, న్యూ ఇయర్ తమకు కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 7:30 AM GMT
కోటి ఆశలతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన హీరోలు!
X

న్యూ రిజల్యూషన్ తో, ఎన్నో హోప్స్ తో కొత్త ఏడాదిలో అడుగుపెట్టేసాం. టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని హీరోలు, ఏడాది కాలంగా బిగ్ స్క్రీన్ మీద కనిపించని కథానాయకులు 2025 మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకూ ప్రతి ఒక్కరూ ఈసారి విజయం వరిస్తుందని, న్యూ ఇయర్ తమకు కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారు.

RRR తర్వాత 'గ్లోబల్ స్టార్' గా ట్యాగ్ మార్చుకున్న రామ్ చరణ్.. 'ఆచార్య' తో డిజాస్టర్ రుచి చూశారు. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' మూవీతో సోలోగా హిట్టు కొట్టి తన స్టార్ ట్యాగ్ ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. సంక్రాంతి బరిలో తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తానని ధీమాగా ఉన్నారు. గతేడాది పొంగల్ కు 'సైంధవ్' సినిమాతో నిరాశ పరిచిన విక్టరీ వెంకటేష్.. ఈసారి పండక్కి 'సంక్రాంతికి వస్తున్నాం' విక్టరీ ఖాయమని భావిస్తున్నారు.

థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ చిత్రాలతో ఫ్లాప్ అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. వాలెంటైన్స్ వీక్ లో 'తండేల్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. రీఎంట్రీలో తన రేంజ్ కు తగ్గ సక్సెస్ సాధించలేకపోయిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ ఏడాది సమ్మర్ లో 'హరిహర వీరమల్లు' సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. దీనితో పాటుగా భారీ అంచనాలు పెట్టుకున్న OG కూడా ఆడియన్స్ ముందుకు రానుంది.

'భోళా శంకర్' తో డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. రెండేళ్ల గ్యాప్ తీసుకొని 'విశ్వంభర' సినిమాతో విజృభించడానికి వస్తున్నారు. చాలా కాలంగా సక్సెస్ కు దూరమైన మంచి విష్ణు.. ఏప్రిల్ లో 'కన్నప్ప' సినిమాతో విజయం సాధిస్తానని వస్తున్నారు. దీనికి ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ క్యామియోలు హెల్ప్ అవుతాయని నమ్ముతున్నారు. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ మాస్ మహారాజా రవితేజ.. సమ్మర్ లో 'మాస్ జాతర' మూవీతో జాతర మాస్ చూపిస్తానని అంటున్నారు.

హిట్టు కోసం గట్టిగా కష్టపడుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, 'VD 12' సినిమాతో కచ్ఛితంగా పాన్ ఇండియా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఏజెంట్ ఫ్లాప్ తో సైలెంట్ అయిపోయిన అఖిల్ అక్కినేని.. 'లెనిన్' మూవీ తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గత నాలుగేళ్లుగా సక్సెస్ రుచి చూడని నితిన్.. ఈ ఏడాదిలో 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కుదిరితే 'ఎల్లమ్మ'ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. హిట్టు కోసం పట్టువిడవకుండా ట్రై చేస్తున్న నాగశౌర్య సైతం కొత్త సంవత్సరంలో కొత్త సినిమాతో రాబోతున్నారు.

'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో బొక్క బోర్లా పడ్డ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. మళ్ళీ తెలుగు తెర మీద సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ముందుగా 'భైరవం' సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 'టైసన్‌ నాయుడు' కూడా ఇదే ఇయర్ లో రానుంది. 'సుందరకాండ' సినిమాతో వస్తోన్న నారా రోహిత్.. 'భైరవం'లోనూ ఒక హీరోగా కనిపించనున్నారు. ఇదే చిత్రంతో దాదాపు ఏడేళ్ల తర్వాత మంచు మనోజ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా చాలా మంది హీరోలు 2025 మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి వీరిలో ఎవరెవరు సక్సెస్ సాధిస్తారో చూడాలి.