ఫేక్ కలెక్షన్ పోస్టర్స్.. ఐటీ రైడ్స్.. వైరల్ మీమ్స్..!
అయితే ఈ విషయం మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ కారణంగానే మేకర్స్ కు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 21 Jan 2025 11:17 AM GMTటాలీవుడ్ లో పలువురు ప్రముఖ నిర్మాతల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరిగాయి. దిల్ రాజు, శిరీష్, హన్సితా రెడ్డి, మైత్రీ నవీన్ యెర్నేని, మైత్రీ సీఈఓ చెర్రీ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసాలు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ కారణంగానే మేకర్స్ కు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు.
'పుష్ప 2: ది రూల్' సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. అలానే మొన్న సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో దిల్ రాజు మిశ్రమ ఫలితాలను అందుకున్నారు. అయినా సరే భారీ వసూళ్లు రాబట్టినట్లుగా ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ డైలీ అప్డేట్లు ఇస్తున్నారు. ఇవే ఇప్పుడు ఆదాయపన్ను శాఖ దృష్టిని ఆకర్షించడంతో అధికారులు దాడులు చేసినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే 'గేమ్ ఛేంజర్' మూవీ హిట్టైందని రుద్దడానికి ఫస్ట్ డే 186 కోట్లు వసూలు చేసినట్లు ఫేక్ పోస్టర్ వేయిచారని, దీని వల్లనే నిర్మాత దిల్ రాజు మీద ఐటీ దాడులు జరుగుతున్నాయిని అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు 'పుష్ప 2' చిత్రాన్ని ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్‌గా చూపించాలనే ఉద్దేశ్యంలో మైత్రీ టీమ్ ఫేక్ పోస్టర్లు విడుదల చేసారని, అదే ఇప్పుడు నిర్మాతలను ఇబ్బంది పడేసిందని రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభిమానులు రివర్స్ లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇలా టాలీవుడ్ లో ఐటి రైడ్స్ నేపథ్యంలో, ఇరు వర్గాల అభిమానులు ఒకరి మీద మరొకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. 'సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఎక్కడ?' అని అధికారులు ప్రశ్నిస్తే.. 'పోస్టర్స్ లో' అని నిర్మాతలు బదులిచ్చినట్లుగా ఫన్నీ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం అనేది కొత్త విషయమేమీ కాదు. కాకపోతే గత కొన్నాళ్లుగా హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ బాగా ఎక్కువగా జరుగుతుండటంతో.. ఈ ఇష్యూని కూడా పరస్పరం విమర్శలు చేసుకోడానికి వాడుకుంటున్నారు అంతే.
నిజానికి నిర్మాతలకు కలెక్షన్ పోస్టర్లు రిలీజ్ చెయ్యాలని ఉండదు. ఎవరూ తమ ఆర్థిక లావాదేవీలను బయటకు చెప్పుకోవాలని అనుకోరు. ఎందుకంటే తమకు వచ్చిన ఇన్కమ్ పబ్లిక్ గా చెబితే, దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ హీరోల ఒత్తిడి మేరకు తమ సినిమాలు ఇంత వసూలు చేశాయి, అంత కలెక్ట్ చేశాయి అంటూ అధికారికంగా ప్రచారం చేసుకోక తప్పడంలేదు. హీరోల అభిమానులను సంతోష పరచడానికి, జనాలను థియేటర్ల వరకూ రప్పించడానికి కూడా పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒరిజినల్ గా ఆ సినిమాలు ఎంత కలెక్షన్స్ రాబట్టాయనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇండియాలో అన్ని ఏరియాలలో సరైన ట్రాకింగ్ ఉండదు. అలాంటి సందర్భాల్లో థియేటర్ ఓనర్లు చెప్పేవే నంబర్స్. అందుకే ఒక అంచనా ప్రకారం గ్రాస్ కలెక్షన్లు లెక్కగట్టి పోస్టర్లు వేస్తుంటారు. కిందరు ఒకడుగు ముందుకేసి వచ్చిన దానికంటే రెండింతలు పెంచి కలెక్షన్స్ చెబుతున్నారు. కానీ ఆ అంశాలే నిర్మాతలకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ఐటీ రైడ్స్ జరిగే వరకూ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ అదే జరుగుతోంది. ఇవేవీ తెలియని అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అని చెప్పుకోడానికి, ఎప్పటిలాగే ఇతర హీరోల ఫ్యాన్స్ తో వార్స్ చేసుకుంటూ ఉంటారు.