టాలీవుడ్ ఫేమస్ లిరిసిస్ట్ కులశేఖర్ కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం నెలకొంది! ప్రముఖ లిరిసిస్ట్ కులశేఖర్ తుదిశ్వాస విడిచారు.
By: Tupaki Desk | 26 Nov 2024 9:46 AM GMTటాలీవుడ్ లో విషాదం నెలకొంది! ప్రముఖ లిరిసిస్ట్ కులశేఖర్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మరణించారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం.. అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కులశేఖర్ మృతిపట్ల పలువురు సెలబ్రిటీస్ సంతాపం ప్రకటించారు.
అయితే ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో 1971 ఆగస్టు 15వ తేదీన జన్మించారు కులశేఖర్. స్కూల్ టైమ్ లోనే కొన్ని పాటలు రాసి అనేక మంది చేత ప్రశంసలు అందుకున్నారు. పలు అవార్డులు గెలుచుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టారు. అదే సమయంలో సాహిత్యంపై తన మక్కువను మరింత పెంచుకున్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద సినిమా పాటల రచనలో మెలకువలు నేర్చుకున్నారు. అనంతరం ఉదయ్ కిరణ్ హీరోగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం మూవీతో గేయ రచయితగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ సినిమాలోని పాటలన్నీ ఆయనే రాశారు. ఆ మూవీలోని పాటలు ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి అనేక సాంగ్స్ రాశారు.
టాలీవుడ్ స్టార్ రైటర్ గా మారారు. జయ, రామ్మా చిలకమ్మా, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు వంటి అనేక తెలుగు చిత్రాలకు ఆయన సాహిత్యం అందించి ఆకట్టుకున్నారు. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ పీ పట్నాయక్, తేజతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. తెలుగు సినీ ప్రియులను మెప్పించారు.
స్టార్ రైటర్ గానే కాకుండా.. ప్రేమలేఖ రాశా సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. అయితే కులశేఖర్ పలు వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. దొంగతనం కేసులో అరెస్టయ్యారు. 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించారు.
ఆ సమయంలో ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా గేయ రచయితగా కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో.. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని చాలా మంది చెబుతుంటారు. దీంతో ఆయన కెరీర్ కు పుల్ స్టాప్ పడిందని అంటుంటారు. తన చివరి దశలో వివాదాలతో గడిపిన కులశేఖర్.. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టారు.