Begin typing your search above and press return to search.

జగన్‌తో అలా, రేవంత్‌తో ఇలా!

ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 3:30 AM GMT
జగన్‌తో అలా, రేవంత్‌తో ఇలా!
X

ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా సినీ ప్రముఖులు ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ తమ పనులు చేసుకుంటూ వచ్చారు. ఏవైనా సమస్యలు తలెత్తినా మీటింగ్ పెట్టి సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు చోట్లా అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో, తెలంగాణలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు.

అల్లు అర్జున్ కేసు.. తదనంతర పరిణామాలతో తెలంగాణా ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతోందనే మాట ఎక్కువగా వినిపించింది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్లు ఉండవని ప్రకటించిన తరుణంలో.. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా సరే, దాదాపు యాభై మంది సినీ జనాలు భేటీకి వెళ్ళారు.

ప్రభుత్వం తరపున సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, రాష్ట్ర డీజీపీ మీటింగ్ లో పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, వెంకటేష్, కిరణ్‌ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, శివ బాలాజీ.. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, సురేష్ బాబు, మురళీ మోహన్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి సహా పలువురు దర్శక నిర్మాతలలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇండస్ట్రీ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.

గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలానే సినీ ప్రముఖులు వెళ్లి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రీ సమస్యల మీద చర్చించి వచ్చారు. వారిలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్.ఎస్. రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి లాంటి ప్రముఖులు ఉన్నారు. మెగాస్టార్ ఆ మీటింగ్ లో జగన్ కు నమస్కరించడంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. చిరుతో దండాలు పెట్టించుకున్నాడని ఫ్యాన్స్ తిట్టిపోశారు. అంతేకాదు అందరినీ గేటు దగ్గర నుంచీ నడిపించారని విమర్శలు చేశారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడానికి చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వెళ్ళలేదు. ఈసారి నాగార్జున, వెంకటేష్ వంటి బిగ్ హీరోలు ముందుండి నడిపించారు. సీనియర్ దర్శక నిర్మాతలు కూడా వారితో పాటుగా ఉన్నారు. అందరూ సీఎంకు నమస్కరించారు. శాలువాలు కప్పారు. దీంతో గతంలో జగన్ తో భేటీ అయిన విషయాన్ని తాజాగా రేవంత్ మీటింగ్ తో లింక్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆరోజు జగన్ కు నమస్కరించినప్పుడు ఆత్మాభిమానం దెబ్బ తింటే, ఇప్పుడు పెద్ద వయసున్న వారు కూడా రేవంత్ కు నమస్కరించినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. రెండిటినీ కంపేర్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.