అందరి కళ్లు దీపావళి పైనే!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్, దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లకు మంచి డిమాండ్ ఉంటుంది.
By: Tupaki Desk | 15 Oct 2024 8:24 AM GMTటాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్, దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవి కాలం వృథాగా పోయింది. విజయ దశమికి ఎవరికీ గొప్ప విజయాలు దక్కలేదు. ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. రజనీకాంత్ ‘వేట్టయన్’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' సినిమాకి పాజిటిక్ టాక్ వచ్చి, రివ్యూలు బాగున్నా కలెక్షన్స్ మాత్రం ఆశించినమేర రాలేదు. గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక' చిత్రాలు కూడా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దీపావళిపై పడింది.
దీపావళి పండుగ ఈసారి గురువారం వస్తుండటంతో, నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోడానికి ఐదు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ''లక్కీ భాస్కర్'' చిత్రాన్ని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన సినిమా 'క'.
కిరణ్ అబ్బవరం హీరోగా తన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ''క''. ఈ దీపావళికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి స్పందన వచ్చింది. అయితే అదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ ''అమరన్'' కూడా రిలీజ్ కాబోతోంది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ వార్ డ్రామాని సీనియర్ హీరో కమల్ హాసన్ నిర్మించారు.
వీటితో పాటుగా సత్యదేవ్, ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన ''జీబ్రా'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'భగీరా' అనే యాక్షన్ మూవీ కూడా ఈ దీపావళికి షెడ్యూల్ చేయబడింది. దీనికి 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టోరీ అందించారు. విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. కంటెంట్ ఏది బాగుంటే అదే జనాలు చూస్తారు కానీ, వాటిల్లో ఏయే సినిమాలకు సరిపడా థియేటర్లు దొరుకుతాయనేది ఆసక్తికరంగా మారింది.
మామూలుగా టాలీవుడ్ లో దీపావళిని డ్రై సీజన్ గా భావిస్తుంటారు. దీపాల పండక్కి రిలీజైన సినిమాలపై పెద్దగా ఆశలు పెట్టుకోకూడదని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఓ టాక్ ఉంది. స్టార్ హీరోలెవరూ ఈ సీజన్ లో రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. క్రిస్మస్ కు వద్దాంలే అనుకుంటారు. అందుకే ప్రతీ ఏడాది దీపావళికి తెలుగులో పోటీ పెద్దగా కనిపించదు. కానీ ఈసారి మాత్రం నాలుగు రోజుల వీకెండ్ ను క్యాష్ చేసుకోడానికి, ఐదు సినిమాలు బరిలో దిగుతున్నాయి. మరి ఇవన్నీ ఆడియన్స్ ను అలరించి టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొస్తాయేమో చూడాలి.