Begin typing your search above and press return to search.

అప్పుడు త్రివిక్రమ్‌ గారి సహకారం మరవలేను : తమన్‌

గుంటూరు కారం సినిమాకు తనను తొలగించాలని చాలా మంది చెప్పినా, మహేష్ బాబు గారి అభిమానులు నాపై ట్రోల్స్ చేసినా త్రివిక్రమ్‌ గారు నా వెంట నిలిచారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 10:30 PM GMT
అప్పుడు త్రివిక్రమ్‌ గారి సహకారం మరవలేను : తమన్‌
X

టాలీవుడ్‌లో ఈ మధ్య కొత్త సంగీత దర్శకులు ఎక్కువ అయ్యారు. కానీ రెండు మూడు సంవత్సరాల క్రితం దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌ల పేర్లు మాత్రమే ఎక్కువ వినిపించేవి. స్టార్‌ హీరోల సినిమాలంటే దేవి శ్రీ ప్రసాద్‌ లేదంటే తమన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపించేవి. ఇప్పుడు అనిరుద్‌తో పాటు పలువురు సంగీత దర్శకులు టాలీవుడ్‌లో బిజీ అయ్యారు. మలయాళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలకు చెందిన సంగీత దర్శకులు సైతం ఈ సమయంలో స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సమయంలో తమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ వంటి వారికి కాస్త ఆఫర్లు తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ తమన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పటిలాగే బిజీగా ఉన్నాను అన్నాడు.

ఆ మధ్య వరుసగా కొన్ని సినిమాలు మ్యూజికల్‌గా నిరాశ పరచడంతో తమన్‌ను పక్కన పెట్టాలని పలువురు హీరోల అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబుతో త్రివిక్రమ్‌ గుంటూరు కారం సినిమా చేస్తున్న సమయంలో సంగీత దర్శకుడిగా తమన్‌ని ఎంపిక చేశారు. ఆ సమయంలో చాలా మంది త్రివిక్రమ్‌ను సోషల్‌ మీడియా ద్వారా తమన్‌ను కాకుండా మరో సంగీత దర్శకుడిని తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మరి కొందరు ఏకంగా తమన్‌ను సంగీత దర్శకుడిగా కొనసాగిస్తే సినిమాను బాయ్‌ కాట్‌ చేస్తామంటూ హెచ్చరించారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత మంది నో చెప్పినా త్రివిక్రమ్‌ సంగీత దర్శకుడిని మార్చలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్‌ ఆ విషయాన్ని గురించి చెప్పుకొచ్చాడు. తమన్ మాట్లాడుతూ... కెరీర్‌లో చాలా సార్లు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కొన్ని సార్లు వ్యక్తిగతంగా తనను టార్గెట్‌ చేశారు. గుంటూరు కారం సినిమాకు తనను తొలగించాలని చాలా మంది చెప్పినా, మహేష్ బాబు గారి అభిమానులు నాపై ట్రోల్స్ చేసినా త్రివిక్రమ్‌ గారు నా వెంట నిలిచారు. ఆ సమయంలో నాకు ఆయన గొప్ప సహకారం అందించారు. ఆ సహకారం కారణంగానే ఆ సినిమాకు మంచి పాటలు చేశాను. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా సినిమా కోసం వర్క్‌ చేయమని త్రివిక్రమ్‌ గారు పలు సార్లు నాతో అన్నారు. ఆ సహకారంతో మంచి పాటలను అందించాను అన్నారు.

మహేష్‌ బాబు సర్కారు వారి పాటకు తమన్‌ అందించిన పేలవమైన సంగీతం కారణంగా గుంటూరు కారం నుంచి ఆయనను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్‌ చేశారు. కానీ త్రివిక్రమ్‌ మాత్రం నమ్మకంతో తమన్‌ను కొనసాగించారు. ఆ నమ్మకంను నిలబెట్టుకున్న తమన్‌ కుర్చీ మడత పెట్టి అంటూ తనను విమర్శించిన వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. సినిమాలోని దాదాపు అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. అందుకే సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా పాటల పరంగా ఏడాది పాటు ట్రెండ్‌ అయ్యింది. యూట్యూబ్‌లో 2024లో అత్యధికంగా ప్లే అయిన పాటగా కుర్చీ మడత పెట్టి నిలిచింది. ప్రస్తుతం తమన్‌ చేతిలో పెద్ద ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా రాజాసాబ్‌, ఓజీ సినిమాలకు తమన్‌ పాటలను అందిస్తున్నాడు.