మాటలు కోటలు దాటించడం మనకే చెల్లిందా!
దీంతో సినిమాలకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. కానీ రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూలు..పబ్లిక్ టాక్ లు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి.
By: Tupaki Desk | 18 Feb 2025 12:30 AM GMTసినిమా పబ్లిసిటీ విషయంలో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన దగ్గర నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకూ ప్రతీ అప్ డేట్ ఎప్పటి కప్పుడు మీడియాకి అందుతుంటుంది. దానిపై రకరకాల కథనాలు వెలువడుతుంటాయి. మధ్యలో టీజర్, ట్రైలర్, లిరికల్ సింగిల్స్, గ్లింప్స్ అంటూ రకరకాలా పేర్లతో జనాల్లో అటెన్షన్ ఉండేలా చేస్తుంటారు.
ప్రచారంలో ఇదో రకమైన స్ట్రాటజీ. ఇక షూట్ పూర్తయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. సరిగ్గా సినిమా రిలీజ్ కి మూడు ..నాలుగు రోజులు ఉంది? అనగా ప్రీ రిలీజ్ నిర్వహిస్తారు. ఇక ఈ మూడు రోజుల ప్రచారమైతే పీక్స్ లో ఉంటుంది. దర్శక, నిర్మాతల మాటలు కోటలు దాటుతుంటాయి. అదే సినిమాకి అతిధులు గా వచ్చిన వారు కూడా ఓ రేంజ్ లో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
దీంతో సినిమాలకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. కానీ రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూలు..పబ్లిక్ టాక్ లు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అభిమానులు సైతం ఆ రిజల్ట్ చూసి తీవ్ర నిరు త్సాహానికి గురవుతున్నారు. ప్రతిగా ఇలాంటి సినిమాని హిట్ అని ఎలా ప్రమోట్ చేస్తున్నారని విమర్శలు మోయాల్సి వస్తోంది. ఓపెనింగ్స్ కోసం ఇదో రకమైన స్ట్రాటజీ అని కాలక్రమంలో అర్దమైంది. రివ్యూ రైటర్లకు- దర్శక, నిర్మాతలకు మధ్య క్లాష్ కూడా ఇక్కడే ఏర్పడుతుంది.
దీనిపై ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పంచాయతీలే నడిచాయి. ఈ తరహా ప్రచారం కేవలం టాలీవుడ్ కి మాత్రమే చెల్లింది. అడపా దడపా కోలీవుడ్ లో ఈ శైలి కొన్ని సినిమాల విషయంలో కనిపిస్తుంటుంది. సినిమా అన్నది వ్యాపారమే అయినప్పుడు బాలీవుడ్ సహా ఇతర పరిశ్రమలో ఈ రేంజ్ లో ప్రచారం ఎందుకు జరగదు? పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయరు? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకొస్తున్న మాట.