Begin typing your search above and press return to search.

సీక్వెల్స్ లో టాలీవుడ్ ను కొట్టేవాల్లే లేరబ్బా..

సీక్వెల్ అంటే తెలుగువాళ్లకి ఓ పక్కా ప్లాన్ ఉంటుంది’ అనే ఫీలింగ్ జ‌నంలో బలంగా నెలకొంది.

By:  Tupaki Desk   |   28 March 2025 9:51 AM
సీక్వెల్స్ లో టాలీవుడ్ ను కొట్టేవాల్లే లేరబ్బా..
X

ఇండియన్ సినిమాల్లో సీక్వెల్స్ కు క్రేజ్ బాగానే ఉంటుంది కానీ అవి అంచనాలను ఆదుకోవడంలో తడబడుతూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ బాగుందే.. రెండో పార్ట్ సాధించగలదా? అనే ప్రశ్న ఎన్నో సార్లు తలెత్తింది. కానీ ఈ అనుమానాన్ని ఎప్పటికప్పుడు చెదరగొడుతున్న ఒకే ఒక్క ఇండస్ట్రీ ఉంటే అది టాలీవుడ్. ఇటీవల కాలంలో సీక్వెల్స్ ప్రాజెక్ట్ లైనప్‌తో వరుసగా విజయం అందుకుంటూ.. ‘సీక్వెల్ అంటే తెలుగువాళ్లకి ఓ పక్కా ప్లాన్ ఉంటుంది’ అనే ఫీలింగ్ జ‌నంలో బలంగా నెలకొంది.

ఈ ట్రెండ్ మొదలైనది బాహుబలితో. మొదటి భాగం ఎంత హిట్ అయినా రెండో భాగం ఇంకా ఎక్కువగా క‌లెక్ట్ చేయ‌డం కేవలం రాజమౌళి అండ్ టీం ప్లానింగ్‌నే కాదు, టాలీవుడ్ ప్రొడక్షన్ ప‌రంగా ఎంత దూరం వెళ్లగలదో చూపించింది. ఆ తరవాత పుష్ప 2తో అదే మ్యాజిక్ రిపీట్ అయింది. బన్నీ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో భాగం, దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఘన విజయం సాధించింది.

ఇవి మినహా చిన్న సినిమాల స్థాయిలోనూ టాలీవుడ్ సీక్వెల్ గేమ్ బలంగా కొనసాగుతోంది. హిట్ 2, మత్తు వదలరా లాంటి సినిమాలు కంటెంట్‌తో పేలిపోతే, టిల్లు స్క్వేర్ మొదటి భాగం హంగామా మీదే ట్రేడ్ రికార్డులను బద్దలు కొడుతోంది. సీక్వెల్ అనగానే స్కేల్ పెంచడం కాదు, ఫస్ట్ పార్ట్ పాయింట్‌ను ఇంకా బలంగా మలచడమే టాలీవుడ్ టెక్నిక్. అందుకే ప్రతి సీక్వెల్‌కు ట్రెయిలర్ వచ్చిన దగ్గరనుంచే ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఏర్పడుతోంది.

ఇదే మోడల్‌ను ఇతర ఇండస్ట్రీలు ఫాలో కావాలని చూస్తున్నా, సరైన ఫలితాలు రాకపోతున్నాయి. ఉదాహరణగా ఇండియన్ 2 ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ , శంకర్ వంటి బిగ్ కాంబో అయినా కూడా మొదటి భాగపు మ్యాజిక్‌ను కొనసాగించలేకపోయారు. అదే మలయాళంలో వచ్చిన ఎంపురాన్, లూసిఫర్కు సీక్వెల్‌గా రావడం, కానీ ప్రీ-రిలీజ్ హైప్‌కి సరిపడా రెస్పాన్స్ ఇవ్వలేకపోయింది.

ఈ రెండింటినీ చూస్తే, సీక్వెల్ అంటే కేవలం స్టార్ కాస్టింగ్ కాదు, కథలో కొత్త కాన్ఫిడెన్స్ అవసరమని అర్థమవుతుంది. సౌత్‌లో మరో బలమైన సీక్వెల్ ఫ్రాంచైజ్ కేజీఎఫ్ మాత్రమే. కానీ అది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికి ఎక్కువగా పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేసినదే. అసలైన గ్రౌండ్ ఉన్నది మాత్రం టాలీవుడ్. వరుసగా మాస్, కంటెంట్, కామెడీ, థ్రిల్లర్ అన్ని జానర్లలోనూ సీక్వెల్స్ ని సక్సెస్ చేయడమంటే ప్లానింగ్, స్క్రిప్ట్ పనితనానికి నిదర్శనం.

ఈ ట్రెండ్ చూస్తే భవిష్యత్తులో టాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాల‌కు హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘బ్రహ్మాండం అంటే బడ్జెట్ కాదు.. బ్రిలియంట్ కాన్సెప్ట్!’ అని టాలీవుడ్ మళ్లీ మళ్లీ నిరూపిస్తూ ముందుకు వెళ్తోంది. "సీక్వెల్ అంటే మిగతా ఇండస్ట్రీలకు డౌట్.. కానీ తెలుగువాళ్లకు డెఫినిషన్!" – అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత ట్రెండ్.