టాలీవుడ్ లో రూరల్ డ్రామాదే రూల్!
అంతకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి సుకుమార్ ఇలాంటి విజయాన్నే నమోదు చేసాడు.
By: Tupaki Desk | 14 March 2025 10:30 PMటాలీవుడ్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ రూలింగ్ నడుస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన 'పుష్ప' చిత్రం పాన్ ఇండియాలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇది పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. చిత్తూరు నేపథ్యంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్ అంశాల్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియాలో సక్సెస్ అయిన చిత్రం. అంతకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి సుకుమార్ ఇలాంటి విజయాన్నే నమోదు చేసాడు. అలా సుకుమార్ మొన్న రంగస్థలం..నిన్న పుష్ప లతో సంచలన విజయాలు నమోదు చేసాడు.
గురువు స్పూర్తితోనే బుచ్చిబాబు ప్రయాణం కూడా కొనసాగుతుంది. తొలి సినిమా 'ఉప్పెన' మత్సకారుల నేపథ్యంలో సాగే విలేజ్ స్టోరీ. తొలి విజయమే బుచ్చిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా అదే దర్శకుడు విలేజ్ నేపథ్యంలోనే మరో సినిమా తెరకెక్కి స్తున్నారు. దీనికి క్రీడా నేపథ్యాన్ని జోడించారు. ఈ సినిమాకు కథానుగుణంగా 'పెద్ది' అనే విలేజ్ టైటిల్ నే ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన 'దేవర' కూడా రూరల్ స్టోరీనే. 'దేవర' మొదటి భాగం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండవ భాగం 'దేవర -2' పూర్తిగా విలేజ్ స్టోరీ అని సమాచారం. కొరటాల ఈ కథకు మరింత మట్టి వాసన జోడిస్తున్నారుట. అలాగే అక్కినేని వారసుడు అఖిల్ కూడా రూరల్ స్టోరీ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదీ చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీనే. పక్కా పల్లెటూరి అబ్బాయి పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ ప్రాజెక్ట్ కూడా రూరల్ స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. 'మెర్సల్', 'బిగిల్' తరహాలో సాగే మట్టి వాసన గల చిత్రమంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ-రవి కిరణ్ కోలా కాంబి నేషన్ లో రూపొందుతున్న 'రౌడీ జనర్దన్' కూడా ఔట్ అండ్ ఔట్ రూరల్ స్టోరీ. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న మాస్ యాక్షన్ చిత్రం కూడా పక్కా రూరల్ నేపథ్యం గల కథ అని సమాచారం. అంటే ఈ రెండు..మూడేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలతోనే స్టార్ హీరోలు ముందుకు రాబోతున్నారు.