టాలీవుడ్ 2024: స్టార్ హీరోల సినిమాలు.. మిశ్రమ స్పందనలు..!
ఇలా ఈ ఏడాది వచ్చిన స్టార్ హీరోల సినిమాలకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
By: Tupaki Desk | 26 Dec 2024 1:30 PM GMT2024 సంవత్సరం టాలీవుడ్ కు మిశ్రమ ఫలితాలను అందించింది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, మరికొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు స్టార్ హీరోలు ఈ ఏడాది వెండి తెర మీద అలరించారు. అయితే వీరు నటించిన ఏ చిత్రానికి కూడా యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. అయినప్పటికీ హీరోల 'స్టార్ పవర్' తో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టగలిగాయి.
'గుంటూరు కారం'
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా ''గుంటూరు కారం''. అతడు, ఖలేజా వంటి కల్ట్ మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేష్ ను ఎనర్జిటిక్ గా ప్రజెంట్ చేసినప్పటికీ, అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ₹230 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనల్ రన్ లో ₹185 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు.
'కల్కి 2898 AD'
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ''కల్కి 2898 AD''. భారీ బడ్జెట్ తో స్టార్ కాస్టింగ్ తో తీసిన ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్లు వచ్చాయి. క్రిటిక్స్ రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే వెలువడ్డాయి. కానీ ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ₹1000 కోట్ల క్లబ్ లో చేరగలిగింది. అయితే ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ఉండటమే ఈ విషయానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
'దేవర పార్ట్-1'
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''దేవర 1''. దీనికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో కొరటాలను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. వరల్డ్ వైడ్ గా ₹500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. RRR స్టార్ ఎన్టీఆర్, ఆయన అభిమానుల కారణంగానే ఈ విషయం సాధ్యమైందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
'పుష్ప 2: ది రూల్'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తీసిన సినిమా "పుష్ప 2: ది రూల్". ఇది 'పుష్ప: ది రైజ్' మూవీకి సీక్వెల్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి ఊహించినంత వైల్డ్ ఫైర్ లేదని కొందరు ఫిలిం క్రిటిక్స్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి పోస్టులే కనిపించాయి. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అత్యంత వేగంగా 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. హిందీలో ₹700 కోట్ల నెట్ రాబట్టిన డబ్బింగ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. మరికొన్ని రోజుల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా ఈ ఏడాది వచ్చిన స్టార్ హీరోల సినిమాలకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయినా సరే బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డాయి. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టి, మంచి విజయాలను అందుకున్నాయి.