బన్నీ అరెస్టు పై సైలెంట్ గా ఉన్న స్టార్ హీరోలు!?
ఆయనకు సంఘీభావం తెలుపుతూ మద్దతుగా నిలిచారు. కానీ కొందరు సెలబ్రిటీలు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 14 Dec 2024 8:00 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు. 'పుష్ప 2' ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో బన్నీపై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. ఇంతలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ, శుక్రవారం రాత్రి చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను కలవడానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఆయనకు సంఘీభావం తెలుపుతూ మద్దతుగా నిలిచారు. కానీ కొందరు సెలబ్రిటీలు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ ని బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో సినీ ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం తెలియగానే చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకొని, తన భార్యతో కలిసి బన్నీ ఇంటికి వెళ్ళారు. నాగబాబు, రానా దగ్గుబాటి కూడా హుటాహుటిన వెళ్ళారు. దిల్ రాజు, మైత్రీ నిర్మాత రవి శంకర్, సితార నిర్మాత నాగవంశీ, తివిక్రమ్ శ్రీనివాస్ చిక్కడపల్లి పీస్ కు వెళ్లి అల్లు అరవింద్ తో పాటు ఉన్నారు. అక్కడి నుంచి బన్నీ వెనకాలే నాంపల్లి కోర్టుకు కూడా వెళ్లి తోడుగా నిలిచారు.
ఇక అల్లు అరెస్ట్ అయిన తర్వాత ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడంపై సానుభూతి తెలుపుతూనే, దీనికి ఒక్కరినే బాధ్యుడిని చేస్తూ అరెస్టు చేయడం సరికాదని అభిప్రాయ పడ్డారు.అందరికంటే ముందుగా హీరో నాని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత అజయ్ భూపతి, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మాజీ, నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, పూనమ్ కౌర్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల స్పందించారు.
బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కంగన రనౌత్, నటుడు రవి కిషన్, కన్నడ హీరో సుదీప్ తదితరులు మీడియా ముఖంగా అల్లు అర్జున్ కు తమ మద్దతు ప్రకటించారు. 'గంగోత్రి' రచయిత చిన్నికృష్ణ ఓ అడుగు ముందుకేసి అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చూసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బెయిల్ పై విడుదల అయిన తర్వాత టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు అందరూ జూబ్లీహిల్స్‌లోని బన్నీ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల నుంచి నాగ చైతన్య, రానా, సురేష్ బాబు పర్సనల్ గా అల్లు అర్జున్ ను కలిశారు. అలానే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు, ఆర్.నారాయణ మూర్తి, సుకుమార్, నవీన్ ఎర్నేని, రవి శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, గుణ్ణం గంగరాజు, కె.రాఘవేంద్రరావు, దిల్ రాజు, వశిష్ఠ, వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, బీవీఎస్ రవి, బీవీఎస్ఎన్ ప్రసాద్, శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఎంఎం కీరవాణి, కన్నడ హీరో ఉపేంద్ర సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి తాజా పరిణామాల గురించి చర్చించారు.
అయితే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలెవరూ అల్లు అర్జున్ ఇంటికి రాలేదు. బన్నీ అరెస్టుపై కనీసం ఒక ట్వీట్ కూడా పోస్ట్ చెయ్యలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేరా అనుకోడానికి, వరుణ్ తేజ్ తాజాగా సాయి తేజ్ కొత్త సినిమా టీజర్ పై ఎక్స్ లో స్పందించారు. అలానే రానాకి రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. బర్త్ డే బాయ్ రానా వచ్చాడు కానీ, చరణ్ ఎందుకు రాలేదో అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్ లాంటి హీరోలు కూడా అల్లు అర్జున్ అరెస్టుపై రియాక్ట్ అవ్వలేదు. మహేశ్ ప్రస్తుతం జర్మనీలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఈ మధ్యకాలంలో నందమూరి ఫ్యామిలీలో జరిగిన విషయాలపై సైలెంట్ గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కూడా మౌనం వహిస్తారని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఫోన్ చేసి బన్నీతో మాట్లాడి ఉండొచ్చని అంటున్నారు. అలానే అల్లు అరవింద్ కు నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక బన్నీ అరెస్ట్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వస్తున్నారని నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి కానీ, ఆయన వచ్చినట్లు సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించారని నిరసన తెలిపినప్పుడు అల్లు అర్జున్ సపోర్టుగా నిలిస్తే.. ఇప్పుడు ఆయన కష్టకాలంలో ఉంటే పవన్ రాలేదని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన పవన్.. ఇప్పుడు సొంత బంధువు అరెస్ట్ అయితే కనీసం సంఘీభావం తెలపడానికి ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పవన్ ఇతర అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేదని జన సైనికులు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో మిగతా హీరోలు కూడా అల్లు అర్జున్ ను కలుస్తారేమో చూడాలి.