Begin typing your search above and press return to search.

ఫ్లాపులు ఎదురైనా గాల్లో తేలిపోతున్న యంగ్ హీరోల డిమాండ్లు!

టాలీవుడ్‌లో యువ హీరోల డిమాండ్స్ రోజు రోజుకు మారిపోతున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   17 March 2025 2:00 AM IST
ఫ్లాపులు ఎదురైనా గాల్లో తేలిపోతున్న యంగ్ హీరోల డిమాండ్లు!
X

టాలీవుడ్‌లో యువ హీరోల డిమాండ్స్ రోజు రోజుకు మారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క హిట్‌ పడినా, పడకపోయినా.. తాము స్టార్‌లమనే నమ్మకంతో పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నారు. సినిమా బడ్జెట్‌, నిర్మాతల పరిస్థితి ఏంటన్నది పట్టించుకోకుండా, తమ రెమ్యునరేషన్‌కు న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కారణంగా పలు చిన్న, మధ్య తరహా నిర్మాతలు ఈ యువ హీరోలతో సినిమాలు తీయడానికి వెనుకంజ వేస్తున్నారు.

ఇటీవల టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో.. సినిమా తీయాలంటే పాతిక కోట్లకు పైగా బడ్జెట్‌ ఉండాల్సిందేనంటూ కండీషన్‌ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన కథతో ఓ యువ దర్శకుడు, నిర్మాత ఈ హీరోను సంప్రదించగా.. అతను కథ నచ్చింది కానీ, బడ్జెట్ తక్కువ అని చేతులెత్తేశాడట. తాను పని చేసే సినిమాకు కనీసం రూ. 25 కోట్ల బడ్జెట్‌ ఉండాలని, తన పారితోషికంగా రూ.10 కోట్లు కావాలని డిమాండ్‌ చేశాడట.

ముఖ్యంగా ఆ హీరో గత కొంతకాలంగా సరైన హిట్ కూడా కొట్టలేదనే విషయంలో నిర్మాతలు ఆశ్చర్యపడుతున్నారు. పైగా అతను బాలీవుడ్‌లో చేసిన ఓ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినా సరే, తన మార్కెట్‌ విలువ ఎంతుందనే ఆలోచన లేకుండా, డైరెక్ట్‌గా డబ్బు, బడ్జెట్‌ విషయాలే మాట్లాడుతున్నాడట. ఇలాంటి తీరుతో ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు సినిమా తీయడం మరింత కష్టంగా మారిపోయింది.

ఒకప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు, తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు చిన్న సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న యువ హీరోలు మొదటి సినిమా నుంచే కోటికి పైగా పారితోషికం కోరడం, ఒక్క హిట్ వచ్చిందా లేదో వెంటనే రెమ్యునరేషన్ డబుల్ చేసుకోవడం చూస్తుంటే ఇండస్ట్రీ పరిస్థితిపై పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులు మంచి కథలు రాసినా, వీటి కోసం సరైన హీరోలను కన్విన్స్‌ చేయడం చాలా కష్టంగా మారింది. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేసేందుకు హీరోలు సై అంటున్న దాఖలాలు తక్కువగానే ఉన్నాయి. పాన్‌ ఇండియా హవా పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మంది నటీనటులు బడ్జెట్‌ పరంగా లెక్కలేయడం మొదలుపెట్టారు. అయితే ఇండస్ట్రీ అనుభవస్తులంటున్నది ఒక్కటే, స్టార్డమ్‌, రెమ్యునరేషన్ అనేవి మార్కెట్‌ను బట్టి నిర్ణయించుకోవాలి, లేదంటే ఈ ట్రెండ్‌ హీరోల కెరీర్‌ను కూడా బోల్తా కొట్టించొచ్చు.

ఈ తరహా డిమాండ్ల వల్ల చిన్న, మీడియం బడ్జెట్‌ సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు. చాలా మంది దర్శకులు తాము అనుకున్న కథలను తెరకెక్కించలేక వెనక్కి వెళ్లిపోతున్నారు. మరి, ఈ ట్రెండ్‌ ఎప్పుడు మారుతుంది, యువ హీరోలు హిట్లు, ఫ్లాపులను పక్కన పెట్టి, కెరీర్‌ను నిలబెట్టుకునే విధంగా వ్యవహరిస్తారా? లేదా పాన్‌ ఇండియా హవాలోనే తేలిపోతారా అన్నది వేచి చూడాలి.