Begin typing your search above and press return to search.

అందం ఉంటే సరిపోదు అమ్మడు.. అదృష్టం కూడా కలిసిరావాలి!

దీనికి ఉదాహరణగా మన టాలీవుడ్ లో అనేకమంది ముద్దుగుమ్మల పేర్లను చెప్పుకోవచ్చు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 6:19 AM GMT
అందం ఉంటే సరిపోదు అమ్మడు.. అదృష్టం కూడా కలిసిరావాలి!
X

వారానికో కొత్త భామ ఎంట్రీ ఇచ్చే సినీ ఇండస్ట్రీలో 'హీరోయిన్' గా నిలదొక్కుకోవడం అంత సులభమేమీ కాదు. అందం, అభినయంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే కొన్నాళ్లపాటు సినిమాల్లో రాణించగలుగుతారు. అందం ఉన్నప్పటికీ, లక్ ఫ్యాక్టర్ కలిసిరాకపోతే ఏ కథానాయికకైనా కష్టమే. మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీ కాబట్టి హీరోలు ఎలాగోలా నెట్టుకొస్తారు కానీ, పాపం హీరోయిన్ల కెరీరే ఇబ్బందుల్లో పడుతుంది. దీనికి ఉదాహరణగా మన టాలీవుడ్ లో అనేకమంది ముద్దుగుమ్మల పేర్లను చెప్పుకోవచ్చు.

కేతిక శర్మ:

ఢిల్లీ భామ కేతిక శర్మ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. 'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కేతిక.. డెబ్యూతోనే ప్లాప్ రుచి చూసింది. అందాల ఆరబోతకు అడ్డుచెప్పకుండా, లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోవడంతో అమ్మడికి మరో రెండు ఆఫర్లు వచ్చాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'లక్ష్య' 'రంగ రంగ వైభవంగా' చిత్రాలు డిజాస్టర్లగా మారాయి. ఆ తర్వాత మెగా మామా అల్లుళ్లను నమ్ముకొని చేసిన 'బ్రో' మూవీ కూడా నిరాశ పరిచింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ఎప్పటి లాగే ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలతో సందడి చేస్తోంది.

మాళవిక శర్మ:

'నేల టికెట్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముంబై మోడల్ మాళవిక శర్మ.. తొలి చిత్రంతోనే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడేళ్ళ గ్యాప్ వచ్చినా, 'రెడ్' మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది కూడా ప్లాప్ అవ్వడంతో కోలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. తమిళ్ లో 'కాఫీ విత్ కాదల్' అనే చిత్రంలో నటించా ఫలితం లేకుండా పోయింది. అయినా సరే ఆమె అందం ఆఫర్స్ తెచ్చిపెట్టింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత చేసిన 'భీమా' సినిమా డిజాస్టర్ అయింది. ఇదే క్రమంలో వచ్చిన 'హరోం హర' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఫస్ట్ వీకెండ్ తరువాత బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీంతో మాళవిక కెరీర్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈ బ్యూటీ.. లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

డింపుల్ హయాతి:

'గల్ఫ్' అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన డింపుల్ హయాతి.. రెండేళ్ల తర్వాత 'అభినేత్రి 2' చిత్రంతో తమిళ తెరకు పరిచయమైంది. 'గడ్డలకొండ గణేష్' మూవీలో ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. 'యురేక' సినిమాలో నటించిన ఈ భామ.. 'అత్రాంగిరే' మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇలా స్టార్ హీరోలతో జోడీ కట్టినా, మూడు భాషల్లో నటించినా.. ఎక్కడా సరైన హిట్టు కొట్టలేకపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన 'సామాన్యుడు', 'ఖిలాడి' సినిమాలు సైతం తీవ్ర నిరాశ పరిచాయి. గతేడాది రిలీజైన 'రామబాణం' సినిమా కూడా పరాజయం పాలైంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న అందాల హయాతి.. ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టింది. 17 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడైనా దర్శక నిర్మాతల చూపు ఆమె వైపు పడుతుందేమో.

నభా నటేష్:

కన్నడ ఇండస్ట్రీలో ఆరంగేట్రం చేసిన నభా నటేష్.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో నటించిన 'అదుగో' ప్లాప్ అయినా, 'ఇస్మార్ట్ శంకర్' మూవీ సాలిడ్ సక్సెస్ అందించింది. అమ్మడి అందాలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. 'డిస్కోరాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మ్యాస్ట్రో' లాంటి వరుస పరాజయాలు అమ్మడి కెరీర్ ను దెబ్బేసాయి. అదే సమయంలో ఆమెకు ఓ యాక్సిడెంట్ జరగడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 'డార్లింగ్' మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అయింది. ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటీ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

సాక్షి వైద్య:

'ఏజెంట్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ సాక్షి వైద్య. ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా మారింది. అయినప్పటికీ 'గాండీవధారి అర్జున' మూవీలో నటించే అవకాశం అందుకుంది. ఇది కూడా ఘోర పరాజయం చవిచూడటంతో తెలుగులో అమ్మడికి అదృష్టం కలసి రాలేదనుకున్నారు. అయితే హీరో శర్వానంద్ 37వ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుని వార్తల్లో నిలిచింది. దీంతో పాటుగా 'హాల్' అనే మలయాళ మూవీకి సైన్ చేసింది. ఈ సినిమాల తర్వాత అమ్మడి కెరీర్ ఎలా సాగుతుందో.

తెలుగులో అవకాశాలు అందుకున్నా, అదృష్టం కలిసి రాని అందాల భామలు ఇంకా చాలామందే ఉన్నారు. సక్సెస్ రుచి చూడని అను ఇమ్మాన్యుయేల్.. చాన్నాళ్ల క్రితమే టాలీవుడ్ ఆఫర్స్ కు దూరమైన ప్రగ్యా జైస్వాల్, పాయల్ రాజ్ పుత్, రెజీనా కాసాండ్రా వంటి కొందరు హీరోయిన్లు ఇప్పుడు పక్క ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు. వీళ్లంతా రానున్న రోజుల్లో సక్సెస్ అందుకొని, మళ్ళీ తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటారేమో చూడాలి.