ఓట్ల పండుగ.. చిరు అలా.. జక్కన్న ఇలా..
సెలబ్రిటీలు కూడా తమకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ప్రజాస్వామ్య పండుగలో భాగమవుతున్నారు. ప్రజలు కూడా కచ్చితంగా ఓటేయాలని కోరుతున్నారు
By: Tupaki Desk | 13 May 2024 9:55 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల తప్ప ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు లోక్ సభ, తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా తమకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ప్రజాస్వామ్య పండుగలో భాగమవుతున్నారు. ప్రజలు కూడా కచ్చితంగా ఓటేయాలని కోరుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉన్న నాయకులకు ఓటు ద్వారా తమ మద్దతు తెలపమని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో తన వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు.
మౌనవ్రతం అని చెప్పాననుకుంటా: చిరు
ఓటు వేశాక మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికలను చిరు గుర్తు చేసుకున్నారు. లాస్ట్ టైమ్.. మౌనవ్రతం అని చెప్పాననుకుంటా అంటూ డైలాగ్ వేశారు. దీంతో అందరూ నవ్వేశారు. ఈ సారి కూడా మెగా కుటుంబమంతా ఎన్నికల్లో ఓటేసిందని తెలిపారు చిరు. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండని కోరారు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత అని తెలిపారు.
'మీ ఓటు పవర్ ఏంటో చూపించండి'
"ఓటు మన రాష్ట్ర, దేశ రూపురేఖలను ఛేంజ్ చేస్తుంది. మీకు న్యాయం చేస్తారు, సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉన్న నాయకులకు మీ మద్దతును ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన రాష్ట్రం, దేశం అభివృద్ధి కావడానికి కచ్చితంగా మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ ఏంటో చూపించండి" అంటూ చిరంజీవి ఓటర్లను కోరారు. అయితే చిరు తెలంగాణలో ఓటేయగా.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీలో ఓటు వేశారు.
రండి ఓటేయండి : రాజమౌళి
ఇక హైదరాబాద్ లో చిరుతోపాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని అని తారక్ విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుత పౌరులమని దేశానికి చాటి చెప్పండని, ఓటేయండని రాజమౌళి పిలుపునిచ్చారు. ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఎన్టీఆర్ ఓటేయగా.. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జక్కన్న తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేయకపోతే!: అల్లు అరవింద్
ఇక నిర్మాత అల్లు అరవింద్.. సెలవు అనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉండకండని, ఏ పార్టీ వస్తే మనకేంటి అనే ఆలోచన వెంటనే మానుకోండని సూచించారు. బయటకొచ్చి ఓటేయండని, లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. తాను ఓటేశానని, అంతా కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుని దేశ అభివృద్ధికి తోడ్పడండని కోరారు యాక్టర్ నరేష్. అలా అనేక మంది ప్రముఖులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.