Begin typing your search above and press return to search.

అగ్ర దర్శకులే టాలీవుడ్‌కు శాపంగా మారారా?

అందరు దర్శకులు ప్రతీ చిత్రాన్ని భారీ స్కేల్ లో రూపొందించాలానే లక్ష్యంతో ఎక్కువ టైమ్ తీసుకోవడమే దీనికి కారణమని కామెంట్లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 5:30 AM GMT
అగ్ర దర్శకులే టాలీవుడ్‌కు శాపంగా మారారా?
X

'పాన్ ఇండియా' ట్రెండ్ మొదలైన తర్వాత 'తెలుగు సినిమా' మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ స్థితి గతులే పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా మన సినిమావైపే చూస్తోందంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బాగానే వుంది కానీ, 'పాన్ ఇండియా' కారణంగా మన స్టార్ హీరోల నుంచి ఎక్కువ సినిమాలు రావడం లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే క్రమంలో, సినిమా సినిమాకీ చాలా టైం తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏడాదికో మూవీ చేసే హీరోలు సైతం, రెండు మూడేళ్లు బిగ్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు సినీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అందరు దర్శకులు ప్రతీ చిత్రాన్ని భారీ స్కేల్ లో రూపొందించాలానే లక్ష్యంతో ఎక్కువ టైమ్ తీసుకోవడమే దీనికి కారణమని కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ కు పాన్ ఇండియాకి బాటలు వేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'బాహుబలి' ఫ్రాంచైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లారు. టాలీవుడ్ మార్కెట్ ను నెక్స్ట్ లెవల్ కు విస్తరించేలా చేశారు. ఈ నేపథ్యంలో మిగతా దర్శకులంతా అదే దారిలో పయనించడం మొదలుపెట్టారు. ఒక సినిమా చేయటానికి మినిమం రెండేళ్లు తీసుకునే సుకుమార్.. ఇప్పుడు మూడేళ్ళు టైం కేటాయిస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' తర్వాత రెండున్నరేళ్ల సమయంతీసుకొని కూడా ఇంకా 'పుష్ప 2' వర్క్ కంప్లీట్ చేయలేకపోయారు. ఆగస్టులో రిలీజ్ చేస్తామన్న చిత్రాన్ని డిసెంబర్ కు వాయిదా వేశారు. దీంతో హీరో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ మీదకు వెళ్తారో తెలియడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అప్పట్లో అనౌన్స్ చేసిన సినిమా ఊసే లేదు.

జూనియర్ ఎన్టీఆర్‌ విషయానికొస్తే, గత ఐదేళ్లలో ఆయన్నుంచి ఒక్కటంటే ఒక్క చిత్రం మాత్రమే వచ్చింది. 2018లో తీసిన 'అరవింద సమేత వీరరాఘవ' తర్వాత సోలో సినిమా అనేదే లేదు. అప్పటి నుండీ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR మూవీకే అంకితమయ్యారు. 2022లో వచ్చిన ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ దక్కడంతో, ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న 'దేవర' విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక రెండో భాగం సంగతి ఏంటనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. ఎందుకంటే తారక్ మధ్యలో హిందీలో 'వార్ 2' పాటుగా, ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చెయ్యాల్సి వుంది. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో, కొరటాల 'దేవర 2' ఎప్పుడు షురూ చేస్తారో ఎవరికీ తెలియదు.

ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన మరో హీరో రామ్ చరణ్ కూడా స్లోగానే ముందుకు సాగుతున్నారు. ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు కానీ, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాని థియేటర్లలో రిలీజ్ చెయ్యలేకపోతున్నారు. శంకర్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో మొదలుపెట్టిన 'గేమ్ ఛేంజర్' మూవీ ఇంకా సెట్స్ మీదనే వుంది. లాంఛనంగా ప్రారంభించిన RC16 రెగ్యులర్ షూట్ కు వెళ్ళలేదు. దీంతో ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు నుంచి ఇంకో మూవీ రావడానికి చాలా టైం పట్టే పరిస్థితి ఏర్పడింది. సుకుమార్ తో ప్రకటించిన RC17 సంగతి సరే సరి. 'పుష్ప: ది రూల్' రిలీజైన రెండు మూడేళ్ళ తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇప్పటి వరకూ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు SSMB29 చిత్రం కోసం సన్నద్ధం అవుతున్నారు. ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది రాజమౌళి సినిమా. ఇక ప్రభాస్ తో 'కల్కి 2898 AD' సినిమా చెయ్యడానికి మూడేళ్లకు పైగానే టైం తీసుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీనికి సీక్వెల్ ఉంటే ఇంకెంత సమయం తీసుకుంటారో చెప్పలేం. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'.. ప్రశాంత్ నీల్ 'సలార్ 2' చిత్రాల పరిస్థితి కూడా అంతే.

ఇలా మన అగ్ర దర్శకులందరూ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకునే పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే చేయడం వల్ల, అభిమానులు తమ హీరోలను చూసుకోవడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అందుకే దీనికి కారణం పాన్ ఇండియా సినిమాలు, భారీ సీక్వెల్ చిత్రాల ట్రెండ్ అని వారు వాదిస్తున్నారు. ఓవైపు తెలుగు సినిమాల మార్కెట్ పెరిగినందుకు సంతోషంగానే ఉన్నా, తమ అభిమాన హీరోలను ఎక్కువ చిత్రాల్లో చూసుకోలేకపోతున్నామని నిరాశ చెందుతున్నారు.

నిజానికి ఈ విషయంలో అభిమానులు తమ హీరోలనో లేదా దర్శకులనో నిందించడం సరికాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నా, మన 'సినిమా' సత్తా ఏంటో చాటిచెప్పారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో భాషా ప్రాంతీయత అడ్డంకులు చెరిపేసారు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దగ్గర నుంచి, హలీవుడ్ ప్రముఖుల వరకూ.. అంతా మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేశారు.

రాజమౌళి RRR చిత్రంతో వందేళ్ల భారతీయ సినిమా ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ నాటు నాటు స్టెప్పులతో గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించారు. సుకుమార్ తీసిన 'పుష్ప' చిత్రంతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకుని బన్నీ చరిత్ర సృష్టించారు. కల్కితో ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలిసి వరల్డ్ బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. రేపు మహేష్ మూవీతో ఇంటర్నేషనల్ మార్కెట్ ను ఓపెన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. దీనంతటికీ మనం గర్వించేలా తప్ప, నిందించడంలో అర్థం లేదు.