టాలీవుడ్ హీరోలు డేట్లు ఇవ్వలేదని బాలీవుడ్ కా?
'జెర్సీ' రీమేక్ తో గౌతమ్ తిన్ననూరి కూడా అదే తరహా సక్సెస్ ప్లాన్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు
By: Tupaki Desk | 6 May 2024 6:10 AM GMTటాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ లో సినిమాలు చేయడం రేర్. హిందీ నటులతో సినిమాలు చేయాలి అన్న ఆసక్తి కూడా మన దర్శకుల్లో పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ తారాగణం టాలీవుడ్ కి రావడమే కాదు...టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేస్తున్న మనోళ్ల జాబితా పెరుగుతంది. అందులో సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే స్టాంప్ వేసేసాడు. `అర్జున్ రెడ్డి`ని..`కబీర్ సింగ్` గా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ కొట్లాడు. అటుపై తెలుగులో అవకాశాలు వచ్చినా కాదని రణబీర్ కపూర్ తో `యానిమల్` చేసి పాన్ ఇండియాలో సంచలనమయ్యారు.
`జెర్సీ` రీమేక్ తో గౌతమ్ తిన్ననూరి కూడా అదే తరహా సక్సెస్ ప్లాన్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. వినాయక్ కూడా `ఛత్రపతి` రీమేక్ తో హిందీకెళ్లారు గానీ పనవ్వలేదు. తాజాగా రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. `హనుమాన్` తో పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడంతో తదుపరి ప్రాజెక్ట్ హిందీలో ప్లాన్ చేసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామ. `రాక్షస్` అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.
అలాగే గోపీచంద్ మలినేని కూడా సన్ని డియోల్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇది గోపీ మార్క్ యాక్షన్ చిత్రమని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చె నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఇక `వారసుడు` తర్వాత వంశీ పైడి పల్లి షాహిద్ కపూర్ ని టార్గెట్ చేసాడు. హిందీలో వంశీ తొలి సినిమా ఇదే. గోల్డ్ మైన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
టాలీవుడ్ నుంచి కూడా ఓ బడా నిర్మాణ సంస్థ భాగమవుతుంది. ఇదే ఏడాది ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇక `బేబి` హిట్ తో సాయిరాజేష్ బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమా ఇక్కడ 100 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఓ స్టార్ కిడ్ పరిచయమవుతుందని సమాచారం. అయితే ఈ దర్శకులంతా బాలీవుడ్ బాట పట్టడానికి మరో కారణం కూడా వినిపిస్తుంది. తెలుగు స్టార్ హీరోలంతా బిజీగా ఉండటంతో వాళ్లు డేట్లు సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో దర్శకులంతా హిందీ హీరోలతో కమిట్ అవుతున్నారు? అనే వాదన పరిశ్రమలో బలంగా వినిపిస్తుంది. ఇక్కడ హీరోలు డేట్లు ఇస్తే గనుక వీళ్లంతా హిందీకి వెళ్లే వారు కాదని అంటున్నారు. మరి అందులో నిజమెంతో తెలియదుగానీ తెలుగు దర్శకులు బాలీవుడ్ కి వెళ్లి పనిచేయడం అన్నది గర్వించదగ్గ విషయం.