Begin typing your search above and press return to search.

రీమేకులను రిజెక్ట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు!

ఆల్రెడీ ఒక భాషలో హిట్టయిన సినిమా హక్కులు తీసుకొని, ఇంకో భాషలోకి రీమేక్ చేయడం రిస్క్ లేని పని అని కొందరు భావిస్తారు

By:  Tupaki Desk   |   6 Aug 2024 10:24 AM GMT
రీమేకులను రిజెక్ట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు!
X

సినీ ఇండస్ట్రీలో 'రీమేక్స్' మీద ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. ఆల్రెడీ ఒక భాషలో హిట్టయిన సినిమా హక్కులు తీసుకొని, ఇంకో భాషలోకి రీమేక్ చేయడం రిస్క్ లేని పని అని కొందరు భావిస్తారు. ఒరిజినల్ కంటే బాగా రావాలని ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని, ఏమాత్రం తేడా వచ్చినా మంచి చిత్రాన్ని రీమేక్ చేసి చెడగొట్టారనే విమర్శలు వస్తాయని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా ఇటీవల కాలంలో రీమేక్స్ ప్రభావం కాస్త తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వాత రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు.

ఓటీటీల విప్లవం మొదలైన తర్వాత సినీ అభిమానులకు విస్తృతమైన కంటెంట్ అందుబాటులో ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చూసేస్తున్నారు. చాలా సెలెక్టివ్ గా థియేటర్లలో చిత్రాలను చూస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్ ను వీక్షించడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఓటీటీలలోనే తెలుగుతో సహా మిగతా ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తుండటంతో.. క్రమం క్రమంగా రీమేక్స్ హవా తగ్గిపోతూ వస్తోందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

బిగ్ స్క్రీన్ మీద రీమేక్ చిత్రాలను చూడటానికి ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదనడానికి, ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ 'సర్ఫీరా' చిత్రాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా.. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అందుకే పొరుగు భాషల సక్సెస్ ఫుల్ సినిమాల రీమేక్ హక్కుల కోసం పోటీ పడే రోజులు పోయాయి. ఈ నేపథ్యంలో 'అపరిచితుడు' లాంటి కొన్ని రీమేక్ ప్రాజెక్ట్స్ ను పక్కన పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ విషయానికొస్తే, నందమూరి బాలకృష్ణ 'ఆవేశం' అనే మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు పచ్చజెండా ఊపినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. బాలయ్య ఈ మధ్య కాలంలోనే రెండు రీమేక్‌లను తిరస్కరించారనే టాక్ ఒకటి బయట వినిపిస్తోంది. ఆయనే కాదు, ఇప్పుడు మన స్టార్ హీరోలెవరూ రీమేక్ మూవీస్ చేయడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

'భోళా శంకర్' తో భారీ డిజాస్టర్ చవిచూసిన సీనియర్ హీరో చిరంజీవి.. తెలుగు ప్రేక్షకులు ఆశించే ఒరిజినల్ కంటెంట్ ఉన్న చిత్రాలకే మొగ్గు చూపుతున్నారు. రీమేక్‌ల విషయంలో చాలా మంది యువ హీరోలు సైతం ఇదే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఎంత మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా నో చెప్తున్నారట. తమిళ, హిందీ అగ్ర హీరోలు సైతం రీమేక్స్ లో నటించడానికి రెడీగా లేరు. బదులుగా పక్క ఇండస్ట్రీల దర్శకులతో కలసి వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే తెలుగులో ఇప్పుడప్పుడే రీమేక్స్ కు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. రీసెంట్ గా టెడ్డి రీమేక్ గా బడ్డీ అనే సినిమా చేశారు అల్లు శిరీష్. ఇది బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచింది. రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో 'మిస్టర్ బచ్చన్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇది రైడ్ అనే హిందీ మూవీ స్పూర్తితో రాసుకున్న కథ. దర్శకుడు తన స్టైల్ లో చాలా మార్పులు చేర్పులు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ హరీశ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేయనున్నారు. ఇది తమిళ్ లో హిట్టయిన తేరి రీమేక్ అనే టాక్ ఉంది.

హరీష్ శంకర్ రీమేక్స్ చేసినా స్క్రిప్టులో చాలా ఛేంజస్ చేస్తుంటారు. ఒరిజినల్ తోకంపేర్ చేసి చూస్తే, పూర్తిగా కొత్త సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. డైరెక్ట్ మూవీ కంటే రీమేకులు తీయడమే కష్టమని డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల ప్రెస్ మీట్ లో అన్నారు. హిట్టయిన సినిమాలనే రీమేక్ చేస్తాం కాబట్టి, మాతృక కంటే మనదే బాగుండాలనే ఒత్తిడి ఉంటుందని చెప్పారు. ఒక మూవీ తీయడానికి మరో సినిమా ఎందుకు ప్రేరణ కాకూడదని హరీష్ ప్రశ్నించారు. గబ్బర్ సింగ్, గడ్డలకొండ గణేష్ చూసి కూడా రీమేక్స్ అంటే వాళ్ళ సినిమా పరిజ్ఞానం పట్ల జాలిపడతానే తప్ప సీరియస్ గా తీసుకోనని అన్నారు. మరి దర్శకుడు మిస్టర్ బచ్చన్ తో మరో హిట్టు కొట్టి రీమేక్స్ లో తన మార్క్ ను నిలబెట్టుకుంటారేమో చూడాలి.