8 నెలలు.. 16 భారీ హిట్లు.. వందల కోట్ల వసూళ్లు
2023లో టాలీవుడ్‌కు చక్కటి ఆరంభం దక్కిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Aug 2023 1:30 AM GMT2023లో టాలీవుడ్‌కు చక్కటి ఆరంభం దక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' డబుల్ బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ ను అందుకున్నాయి. ఇందులో 'వాల్తేరు' రూ.200కోట్లకుపైగా వసూళ్లను సాధించగా.. 'వీరసింహా' దాదాపు రూ. 130కోట్ల వరకు అందుకుంది. అయితే ఇప్పుడీ ఏడాది పూర్తై ఎనిమిది నెలలు అవుతోంది. అయితే ఈ 8 నెలల్లో బాక్సాఫీస్ ముందు స్ట్రైట్ అండ్ డబ్బింగ్ సినిమాల హిట్స్ శాతం బాగానే ఉంది.
ఇప్పటివరకు 16 సినిమాల వరకు భారీ హిట్లను అందుకున్నాయి. అందులో మొదటి రెండు చిత్రాలు 'వాల్తేరు', 'వీరసింహా' అన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీరసింహారెడ్డి'.. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగి.. మొత్తంగా రూ. 80 కోట్ల షేర్, రూ. 134 కోట్ల గ్రాస్ తో హిట్ స్టేటస్ అందుకుంది. 'వాల్తేరు వీరయ్య'.. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి రూ. 135కోట్లు షేర్, రూ. 236.15 కోట్ల గ్రాస్ అందుకుంది. మొత్తంగా రూ. 46 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది.
ఫిబ్రవరి 3న రిలీజైన 'రైటర్ పద్మభూషణ్'.. రూ. 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 6.45 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 4.45 కోట్ల లాభాలను తెచ్చుకుని డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మార్చి 17న వచ్చిన ధనుశ్ 'సార్'.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 38.60 కోట్లు గ్రాస్, ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.05 కోట్ల షేర్ (రూ. 120.83 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.
మార్చి 18న శివరాత్రి కానుకగా రిలీజైన కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు' కథ కూడా హిట్ స్టేటస్ అందుకుంది. రూ. 5.29 కోట్ల షేర్, రూ. 10.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే మార్చిలో రిలీజైన హృదయాల్ని హత్తుకున్న 'బలగం' నిర్మాతకు పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. త్రిపుల్ బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మార్చి 22న వచ్చిన విశ్వక్ 'దాస్ కా దమ్కీ'.. రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. రూ. 11 కోట్లకు పైగా షేర్ అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక నాని 'దసరా' అయితే ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక సాయి ధరమ్ తేజ్ మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' కూడా రూ.100కోట్లకు చేరువలో వెళ్లింది. చిన్న సినిమాగా వచ్చిన 'మేం ఫేమస్' మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన శ్రీవిష్ణు 'సామాజవరగమణ', ఆనంద్ దేవరకొండ 'బేబీ' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. 'సామాజవరగమణ' రూ. 50కోట్ల వరకు వసూలు చేయగా 'బేబీ' కూడా రూ.70కోట్లకు పైగా అందుకుంది. ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు ఊహించని రేంజ్ లో భారీ లాభాలను తెచ్చి పెట్టడం విశేషం.
ఇక ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు డబ్ సినిమాలు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. సంక్రాంతి 'వాల్తేరు', 'వీరసింహా'తో పాటు వచ్చిన విజయ్ 'వారసుడు' ఏకంగా రూ.300కోట్ల వరకు వసూళ్లను అందుకుంది. విజయ్ ఆంధోనీ 'బిచ్చగాడు 2' మంచి వసూళ్లనే అందుకుంది. ఏ అంచనాలు లేకుండా కేరళ వరదలు నేపథ్యంలో వచ్చిన '2018' సంచలనాలు సృష్టించింది. తాజాగా ఇప్పుడు రజనీకాంత్ 'జైలర్' విడుదలై కూడా రికార్డ్ వసూళ్లను అందుకుంటూ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుటికే రూ.100కోట్లకు చేరువలో ఉంది.