Begin typing your search above and press return to search.

మంచి సీజన్ ను మిస్ చేసుకుంటున్న టాలీవుడ్!

అందరూ ఇలాంటి మంచి సీజన్ ను వదులుకొని డిసెంబర్ నెలలో కర్చీపులు వేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 4:30 PM GMT
మంచి సీజన్ ను మిస్ చేసుకుంటున్న టాలీవుడ్!
X

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ ను సినిమాలకు బెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. ఆ తర్వాత ఎక్కువ సెలవులు ఉండే సమ్మర్ సీజన్ వైపు మొగ్గు చూపుతారు. దీని తర్వాత అందరూ దృష్టి సారించే సీజన్ దసరా. దాదాపు రెండు వారాల పాటు సెలవులు ఉంటాయి కాబట్టి, విజయ దశమికి వస్తే విజయం గ్యారంటీ అని భావిస్తారు. టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను డోకా ఉండదు. అందుకే దసరా పండుగ కోసం తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర పోటీ ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈసారి ఫెస్టివల్ కి తెలుగు నుంచి పెద్దగా పెద్ద సినిమాలు రావడం లేదు. అందరూ ఇలాంటి మంచి సీజన్ ను వదులుకొని డిసెంబర్ నెలలో కర్చీపులు వేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దేవర' పార్ట్-1 చిత్రాన్ని ముందుగా దసరా స్పెషల్ గా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ చెప్పిన డేట్ కు రావడం లేదు. పవన్ కళ్యాణ్ OG వాయిదా పడటంతో, తారక్ మూవీని సెప్టెంబర్ 27వ తేదీకి షిఫ్ట్ చేసారు. ఈ నేపథ్యంలో అదే రోజున రావాల్సిన 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి తీసుకొచ్చారు. దీంతో దసరాకి తెలుగు వైపు నుంచి పెద్ద సినిమా లేకుండా పోయింది. దాన్ని ఇప్పుడు డబ్బింగ్ చిత్రాలు క్యాష్ చేసుకుంటున్నాయి.

సూర్య నటిస్తున్న 'కంగువ' సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అలానే రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'వెట్టయాన్' చిత్రాన్ని కూడా అదే డేట్ కు తీసుకొస్తున్నారు. అప్పటికే 'దేవర' సినిమా వచ్చి రెండు వారాల రన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టయినా మూడో వారానికి థియేటర్లు తగ్గిపోతాయి. అందులోనూ రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలకు ఇక్కడ యూవీ క్రియేషన్స్, ఏసియన్ సురేష్ సంస్థల సపోర్ట్ ఉండనే ఉంది కనుక, వాటికి ఎక్కువ స్క్రీన్లు దొరికే అవకాశం లేకపోలేదు.

ఇక దీపావళి పండుగకు టాలీవుడ్ లో పెద్ద సినిమాలను రిలీజ్ చెయ్యడానికి మన నిర్మాతలు ఆసక్తి కనబరచరు. ఈసారి విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' లాంటి ఒకటీ అర మీడియం రేంజ్ తెలుగు చిత్రాలు మినహా.. ఆ స్లాట్ ను కూడా తమిళ డబ్బింగు చిత్రాలే ఆక్రమించబోతున్నాయి. ఇప్పటికే శివ కార్తికేయన్ 'అమరన్' సినిమా రేసులోకి వచ్చింది దీంతో పాటుగా అజిత్ కుమార్ 'విదయ మయార్చి' మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి.

డిసెంబర్ విషయానికొస్తే, నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో తెరకెక్కతున్న 'తండేల్' సినిమాని రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. నితిన్ నటిస్తున్న 'రాబిన్ హుడ్' చిత్రాన్ని క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి తప్పుకున్న అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రాన్ని, డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. ఇంతలోనే మంచు విష్ణు అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన 'కన్నప్ప' చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా 'గేమ్ చేంజర్' కూడా రేసులోకి వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని, క్రిస్మస్ పండక్కి విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

డిసెంబర్ లో ఒకేసారి ఇన్ని క్రేజీ చిత్రాలను రిలీజ్ చేస్తామంటే థియేటర్ల సమస్య వస్తుంది. అది కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మారిన పరిస్థితులను బట్టి కొన్ని సినిమాల విడుదల తేదీల్లో మార్పులు ఉండొచ్చు. అదే జరిగితే ఆ సినిమాలకు మళ్ళీ ఇప్పట్లో మంచి డేట్లు దొరిక్క పోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి స్లాట్స్ బుక్ అయిపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలలకు తీసుకుపోతే, అప్పటికి వడ్డీలు పెరిగి నిర్మాతల మీద మరింత భారం పడుతుంది.

ఇదంతా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లనే జరుగుతోందని అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాలన్నీ ముందుగానే ఎప్పటికి పూర్తవుతాయో అన్నీ లెక్కలేసుకొని, డేట్స్ అనౌన్స్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా జరగకపోవడం వల్లనే ఇప్పుడు మన ఫిలిం మేకర్స్ దసరా లాంటి మంచి సీజన్ ను మిస్ చేసుకొని, డిసెంబర్ లో క్లాష్ వచ్చేలా చేశారు. ఇప్పటి నుంచైనా పెద్ద చిత్రాలను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ చేస్తే, చిన్న మీడియం రేంజ్ సినిమాలకు రిలీజుల విషయంలో తలనొప్పులు లేకుండా ఉంటాయి.