బడా బ్యానర్లు - కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు!
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి
By: Tupaki Desk | 2 April 2024 2:45 AM GMTటాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తూనే, మరోవైపు విభిన్నమైన సబ్జెక్ట్‌లతో వచ్చే యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న బ్యానర్ కు అనుబంధంగా మరో కొత్త ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేసి, చిన్న మీడియం రేంజ్ చిత్రాలను నిర్మిస్తున్నారు.
* SVC - దిల్ రాజు ప్రొడక్షన్స్:
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత కొన్నేళ్ళుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీశారు. అయితే గతేడాది 'దిల్ రాజు ప్రొడక్షన్స్' అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. దీని ద్వారా రెండో తరం వారసులు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డిలను నిర్మాతలుగా పరిచయం చేశారు. ఇదే బ్యానర్ లో 'బలగం' వంటి చిన్న సినిమా తీసి, భారీ విజయాన్ని సాధించారు. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆశిష్ హీరోగా 'లవ్ మీ' సినిమా చేస్తున్నారు. అలానే 'ఆకాశం దాటి వస్తావా' అనే మూవీతో పాటుగా సుహాస్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నారు.
* హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్:
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) తన సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే భారీ బడ్జెట్ సినిమాలని నిర్మిస్తుంటారు. అదే సమయంలో దానికి అనుబంధ సంస్థగా 'సితార ఎంటర్టైన్మెంట్స్' ను ఏర్పాటు చేసి తన సోదరుని కుమారుడు సూర్యదేవర నాగవంశీ పేరు మీద సినిమాలు తీస్తుంటారు. అలానే 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' అనే బ్యానర్ ను స్థాపించి, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యను కూడా నిర్మాణంలో భాగం చేస్తూ వస్తున్నారు. గతేడాది 'మ్యాడ్' లాంటి సినిమాతో హిట్టు కొట్టిన మేకర్స్.. లేటెస్టుగా 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇంతకుముందు భ్రమయుగం సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించారు. 'మ్యాడ్ మ్యాక్స్'తో పాటుగా టిల్లు క్యూబ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు.
* యూవీ క్రియేషన్స్ - V సెల్యులాయిడ్:
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించారు నిర్మాతలు వంశీ, ప్రమోద్. అలానే కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను రూపొందించడానికి 'V సెల్యులాయిడ్' పేరుతో మరొక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. శివరాత్రికి 'గామి' లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని అందించారు. ఇటీవల 'ఓం భీమ్ బుష్' వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టెనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సుధీర్ బాబుతో 'మా నాన్న సూపర్ హీరో'.. శర్వానంద్ తో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవితో 'విశ్వంభర' లాంటి భారీ సోషియో ఫాంటసీ జోనర్ సినిమా నిర్మిస్తున్నారు.
* గీతా ఆర్ట్స్ - GA2 పిక్చర్స్:
టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. తన తండ్రి స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. ఇదే క్రమంలో GA2 పిక్చర్స్ సంస్థను ఏర్పాటు చేసి, మీడియం రేంజ్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఆహా ఓటీటీ ద్వారా విభిన్నమైన కంటెంట్ తో వచ్చే యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో హిట్టు కొట్టారు. ప్రస్తుతం 'తండేల్' లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేస్తూనే, బోయపాటి శ్రీను సినిమాను లైన్ లో పెట్టారు.
* వైజయంతీ మూవీస్ - స్వప్న సినిమాస్:
తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఇప్పటి వరకూ ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు నిర్మాత అశ్వినీ దత్. ఆయన కుమార్తెలు కలిసి 'స్వప్న సినిమాస్' అనే మరో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. 'మహానటి', 'జాతిరత్నాలు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. ప్రస్తుతం 'కల్కి 2898 AD' వంటి అత్యంత భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
* మైత్రీ మూవీ మేకర్స్ & AK ఎంటర్టైన్మెంట్స్:
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను బ్యాంక్ రోల్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మీడియం రేంజ్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. ఇతర భాషల్లో రూపొందిన 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం', 'మంజుమ్మల్ బాయ్స్' లాంటి కంటెంట్ మూవీస్ ను తెలుగు ఆడియెన్స్ కు అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాత అనిల్ సుంకర.. మరోవైపు ఇతర నిర్మాతలతో కలిసి మంచి కంటెంట్ తో మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల 'ఊరి పేరు భైరవకోన' చిత్రంతో సక్సెస్ సాధించారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నారు.