Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ని 'ఫ్యాక్ట‌రీ మోడల్' తో ఏల్తున్న నిర్మాత‌?

కేవ‌లం 5శాతం మాత్ర‌మే స‌క్సెస్ రేటు ఉండే టాలీవుడ్ లో నిర్మాత‌లు ఎలాంటి గేమ్ ఆడాలి. ఫ్లాప్ తీసినా ఆ త‌ర్వాత కూడా ఇక్క‌డ నిల‌బడి మ‌రో సినిమా ఎలా ప్రారంభించాలి?

By:  Tupaki Desk   |   22 July 2023 4:34 PM GMT
టాలీవుడ్ ని ఫ్యాక్ట‌రీ మోడల్ తో ఏల్తున్న నిర్మాత‌?
X

కేవ‌లం 5శాతం మాత్ర‌మే స‌క్సెస్ రేటు ఉండే టాలీవుడ్ లో నిర్మాత‌లు ఎలాంటి గేమ్ ఆడాలి. ఫ్లాప్ తీసినా ఆ త‌ర్వాత కూడా ఇక్క‌డ నిల‌బడి మ‌రో సినిమా ఎలా ప్రారంభించాలి? అస‌లు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు ఎలా నిర్మించాలి? అంటే దీనికి ఒక్కొక్క‌రి స‌మాధానం ఒక్కోలా ఉంటుంది. ఇది లోతైన ప‌రిజ్ఞానంతో కూడుకున్న విష‌యం.

అయితే తెలుగు చిత్ర‌సీమ‌లోనే కాదు ఏ రంగంలో అయినా నిల‌బడాలంటే ప‌ర్ఫెక్ట్ డేటా.. ప‌క్కా ఇన్ఫ‌ర్మేష‌న్ ఉంటే చాల‌ని ఒక ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత సూత్రీక‌రించారు. ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించిన ఐదారేళ్ల‌లోనే 50 సినిమాలు పూర్తి చేసేందుకు వేగ‌వంత‌మైన ప్ర‌ణాళిక‌ల్ని ఆయ‌న క‌లిగి ఉన్నారు. స‌క్సెస్ రేటు లేని సినీరంగంలోకి కేవ‌లం ఫ్యాష‌న్ కోసం ఆయ‌న ఐటీ ప‌రిశ్ర‌మ నుంచి సినిమాలు తీసేందుకు విచ్చేశారు. అయితే ఈ రంగంలో ఆయ‌న లెక్క‌లు ఆయ‌న‌కున్నాయి. ఒక సినిమాని నిర్మిస్తే అయ్యే ఖ‌ర్చు .. తిరిగి పెట్టుబ‌డిని ఎలా రాబ‌ట్టుకోవాలి అనే ఫార్ములా తెలిసి ఉంటే.. స‌రైన స‌మాచారంతో స‌రైన బిజినెస్ సాగించ‌గ‌లిగితే ఇక్క‌డ ఎలాంటి స‌మస్యా ఉండ‌ద‌ని .. అలా చేయ‌గ‌లుగుతున్నాం కాబ‌ట్టే తాము ఇంకా ప‌రిశ్ర‌మ‌లో నిల‌బ‌డి ఉన్నామ‌ని స‌ద‌రు నిర్మాత తెలిపారు.

అంతేకాదు.. వ‌ర‌స‌గా ఫ్లాప్ సినిమాలు తీసినా కానీ వెంట వెంట‌నే ఇత‌ర ప్రాజెక్టుల‌ను ఎలా సెట్స్ పైకి తీసుకెళుతున్నారు? అన్న‌దానికి ఆయ‌న ఇచ్చిన స‌మాధానాంతో దిమ్మ తిరిగిపోతోంది. టాలీవుడ్ ని చాలా వ‌ర‌కూ ఔపోష‌ణ ప‌ట్టాకే ఇక్క‌డ సినిమాలు తీస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఐటీ ఇండ‌స్ట్రీకి భిన్న‌మైన ఈ ప‌రిశ్ర‌మ‌లో తాము `ఫ్యాక్ట‌రీ మోడ‌ల్` లో సినిమాలు తీస్తామ‌ని ఇందులో లాభ‌న‌ష్టాల్ని ముందే అంచ‌నా వేస్తామ‌ని.. ఏ సినిమాతో ఎంత వ‌స్తుంది? ఎంత పోతుంది? అనే ఇన్ఫ‌ర్మేష‌న్ ప‌క్కాగా త‌మ వ‌ద్ద రిలీజ్ ముందే ఉంటుంద‌ని కూడా తెలిపారు. రిలీజ‌య్యాక హిట్టు టాక్ వ‌స్తే లాభ‌ప‌డ‌తాం. లేదంటే యావ‌రేజ్ గా దానిని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా తెలుసున‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌ల రిల‌జైన ఆదిపురుష్ చిత్రాన్ని ఆయ‌న రిలీజ్ చేసారు. ఫ్లాప్ టాక్ వ‌చ్చినా త‌మ పెట్టుబ‌డి త‌మ‌కు తిరిగి వ‌చ్చేలా ప్ర‌తిదీ డిజైన్ చేసామ‌ని కూడా అన్నారు.

ఇక తాము పూర్తిగా ఫ్యాక్ట‌రీ మోడల్ ని అనుస‌రిస్తామ‌ని అది త‌మ వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తుంద‌ని కూడా ర‌హ‌స్యాన్ని ఓపెన‌య్యారు. వ‌రుస‌గా ప‌ది నుంచి 15 సినిమాల‌కు ప‌ని చేయ‌డం.. నాలుగైదు సినిమాల్ని ప్ర‌క‌టించేయ‌డం.. రిలీజ్ కి తేవ‌డం ఇదంతా ఒక ఫ్యాక్ట‌రీ వ‌ర్క్ లాంటిది. రిలీజ్ చేసిన‌వాటిలో కొన్ని పెద్ద స‌క్సెస్ లు.. కొన్ని యావ‌రేజ్ లు.. కొన్ని ఫ్లాపులు వ‌స్తాయి.. అయితే స‌క్సెస్ సాధించిన‌వాటితో అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్ ని ర‌న్ చేస్తున్నాం. ఇక్క‌డ ప‌క్కా డేటా ఇన్ఫ‌ర్మేష‌న్ ఆధారంగా బిజినెస్ సాగిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. మొత్తానికి వంద‌ల కోట్లు పోగొట్టుకుంటున్న నిర్మాత‌లు అంటూ క‌ల‌త చెందే మీడియా విశ్లేష‌ణ‌ల‌కు భిన్నంగా ఆయన క్యాలిక్యులేష‌న్స్ చూస్తుంటే ఈ లాజిక్కేంట‌బ్బా? అంటూ అంద‌రూ నోరెళ్ల‌బెట్టాల్సిన సన్నివేశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం స‌ద‌రు నిర్మాత 50 సినిమాల క్ల‌బ్ లో అడుగుపెట్టేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అన్నారు. ఇప్ప‌టికే మా బ్యాన‌ర్ లో 25 రిలీజ్ చేసాం. 5 రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కొన్ని చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. 15 సినిమాల‌కు స్క్రిప్టులు రెడీ అవుతున్నాయి. ప్రీప్రొడ‌క్ష‌న్ లో ఇవ‌న్నీ ఉన్నాయి.. అంటూ చ‌క‌చ‌కా లెక్క‌లు చెప్పిన ఆయ‌న 50 సినిమాలు పూర్తి చేసేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ధీమాను క‌న‌బ‌ర‌చ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఫ్యాక్ట‌రీ మోడ‌ల్ లో సినిమాలు చేస్తున్నామ‌ని చెబితే చాలా మంది ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు పెద‌వి విరిచేశార‌ని ఇలా వ‌చ్చి వెళ్లే వారి జాబితాలో ఆయ‌న ఉన్నాడంటూ ఎద్దేవా చేసార‌ని స‌ద‌రు నిర్మాత తెలిపారు. చాలా మంది అగ్ర నిర్మాత‌లు ఆచితూచి అర‌కొర‌ సినిమాలు నిర్మిస్తున్న ఈ రోజుల్లో స‌ద‌రు యువ‌నిర్మాత ఫ్యాక్ట‌రీ మోడల్ లో ఏడాదికి 10 సినిమాలు తీసేస్తుండ‌డం ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.