వినాయకచవితి టూ దసరా.. సినిమాల జాతర!
చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడాది వందలాది సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటాయి. వీటిలో మెజారిటీ సినిమాలు మెప్పించలేక చతికిలబడతాయి
By: Tupaki Desk | 15 Sep 2023 4:43 AM GMTచిత్ర పరిశ్రమలో ప్రతి ఏడాది వందలాది సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటాయి. వీటిలో మెజారిటీ సినిమాలు మెప్పించలేక చతికిలబడతాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు కూడా మౌత్ టాక్ తో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడతాయి. ఈ ఏడాదిలో చూసుకుంటే చిన్న సినిమాలైన బలగం, బేబీ, సామజవరగమన సినిమాలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ సునామీ సృష్టించాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఏజెంట్, భోళా శంకర్, శాకుంతలం లాంటి సినిమాల రిసల్ట్ ఏంటనేది అందరికి తెలిసిందే. దీనిని బట్టి ప్రేక్షకాదరణ పొందడానికి సినిమా బడ్జెట్ తో సంబంధం లేదు. కథ నచ్చితే నెత్తిన పెట్టుకుంటారని ఈ ఫలితాలే నిరూపిస్తున్నాయి. అలాగే వినాయకచవితి సీజన్ మొదలుకొని దసరా వరకు ఒకే డేట్ లో మూడు కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 15న ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. విశాల్ హీరోగా తెరకెక్కిన మార్క్ ఆంటోనీ పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లోకి వస్తోంది. రవితేజ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా మూవీ కూడా ప్రేక్షకాదరణ కోసం అదృష్టం పరీక్షించుకుంటుంది. వీటితో పాటుగా రామన్న యూత్, సోదర సోదరీమణులారా అనే రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 28న రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న స్కంద థియేటర్ లోకి వస్తోంది. అలాగే లారెన్స్ హీరోగా తెరకెక్కిన డబ్బింగ్ మూవీ చంద్రముఖి 2 కూడా రిలీజ్ కి సిద్ధమైంది. కంగనా రనౌత్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పెద కాపు 1 సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 6న కిరణ్ సబ్బవరం రూల్స్ రంజాన్ మూవీ రిలీజ్ కాబోతోంది.
అలాగే స్వాతి, నవీన్ చంద్ర కాంబోలో తెరకెక్కిన మంత్ ఆఫ్ మందు మూవీ కూడా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వీటి తర్వాత దసరా కానుకగా అక్టోబర్ 19న బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. అదే రోజు ఇళయదళపతి విజయ్ లియో మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ఘోస్ట్ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవ్వనుంది. మాస్ మహారాజ్ రవితేజ చేస్తోన్న బయోపిక్ మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది.