టాలీవుడ్.. ఇక నెలకో బిగ్ బ్లాస్ట్
సక్సెస్ అయిన సినిమాలు కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. అయితే మన స్టార్స్ అందరూ ఈ ఏడాది ద్వితీయార్ధంలో సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు.
By: Tupaki Desk | 29 April 2024 4:45 AM GMTఈ ఏడాది ప్రథమార్ధంలో టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ రాలేదు. పాన్ ఇండియా బ్రాండ్ తో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకున్న మూవీ హనుమాన్ మాత్రమే. తరువాత వచ్చినవన్నీ చిన్న సినిమాలు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రవితేజ ఈగల్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. సక్సెస్ అయిన సినిమాలు కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. అయితే మన స్టార్స్ అందరూ ఈ ఏడాది ద్వితీయార్ధంలో సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ టాలీవుడ్ నుంచి రిలీజ్ కాబోతోంది. అవన్నీ కూడా బిగ్ స్కేల్ పై భారీ అంచనాల మధ్య రాబోతున్న చిత్రాలే కావడం విశేషం. వీటిలో ముందుగా కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యధిక స్క్రీన్స్ లో ఏకంగా 22 భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాని జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తునానరు. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం విశేషం. ఆగష్టులో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ఈ సినిమా ద్వారా పెరగనుందనే టాక్ వినిపిస్తోంది. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓజీ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఎన్నికలు ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబందించిన పెండింగ్ సీన్స్ కంప్లీట్ చేయనున్నాడని తెలుస్తోంది. పవర్ స్టార్ నుంచి పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోయే మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
అక్టోబర్ 10న దసరా కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామని చిత్ర యూనిట్ కూడా బలంగా నమ్ముతుంది. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరిలో మెగాస్టార్ విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్ సినిమాలలో ఒకటి ప్రేక్షకుల ముందుకి రావడం పక్కా అని తెలుస్తోంది.