ఈ వారం చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ పోలికలు గమనించారా?
మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి
By: Tupaki Desk | 2 Jun 2024 5:35 AM GMTఓవైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్ తో వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. షెడ్యూల్ చేసుకున్న పెద్ద సినిమాలు వాయిదా పడగా.. చిన్న చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు. గత వారం వచ్చిన లవ్ మీ మూవీ కాస్త సందడి చేసింది. ఈ వారం ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, కార్తికేయ తమ చిత్రాలతో పోటీ పడ్డారు. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.
అయితే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. ఆనంద్ దేవరకొండ గం గం గణేశా, కార్తికేయ భజే వాయువేగం చిత్రాలు మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నాయి. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే.. మూడు సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీనే ఎక్కువ వసూళ్లు సాధించింది. వీకెండ్ లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు చెబుతున్నారు.
ఇప్పుడు ఈ మూడు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మూడింటిలో ఇంట్రెస్టింగ్ పోలికలు మూడు ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. వాటిని వివరిస్తున్నారు కూడా. మూడు సినిమాల్లో బ్లాక్ మనీతో పాటు దాని చుట్టూ తిరిగే సన్నివేశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయా చిత్రాల నిర్మాతల పేర్లలో వంశీ పదం కామన్ గా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.
భజే వాయు వేగం సినిమాను యూవీ వంశీ నిర్మించగా.. గం గం గణేశా చిత్రాన్ని కారుమంచి వంశీ రూపొందించారు. అయితే ముఖ్యంగా మూడు మూవీల్లో హీరో రోల్ కు సంబంధించి ఆసక్తికరమైన కామన్ పాయింట్ ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో అనాధగా మారుతాడు. ఎదగడమే మన హక్కని తండ్రి చెప్పిన మాటను నమ్మి దొంగతనాలు కూడా చేస్తాడు హీరో.
ఇక భజే వాయు వేగంలో కార్తికేయ రోల్ కూడా అలాంటిదే. సినిమాలో అనాథ అయిన అతడు.. ఓ కారును దొంగలించే ప్లాన్ లో భాగమమవుతాడు. గం గం గణేశాలో ఆనంద్ దేవరకొండ డైమండ్ దోచుకునే దొంగగా కనిపిస్తాడు. వేర్వేరు దర్శకులు తీసిన ఈ మూడు సినిమాల్లో మూడు కామన్ పాయింట్స్ ఉండడం విశేషం. అయితే ఇలాంటివి ఇండస్ట్రీలో తరచూ జరుగుతుంటాయి. మరి ఈ చిత్రాలు చూశారా? వాటిని మీరు గమనించారా?