Begin typing your search above and press return to search.

మార్కెట్‍లో కంటెంట్ లేకనే పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా 'మురారీ' 4K మూవీని ఆగస్టు 9న గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయబోతున్నారు

By:  Tupaki Desk   |   25 July 2024 12:30 AM GMT
మార్కెట్‍లో కంటెంట్ లేకనే పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారా?
X

టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంటోంది. గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అనేక తెలుగు చిత్రాలు మరోసారి థియేటర్లలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. పాత సినిమాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి 4K వెర్షన్ లోకి రీమాస్టర్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నదే అయినప్పటికీ.. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోల చిత్రాలను కొన్ని రోజుల గ్యాప్ లో రీరిలీజ్ చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా 'మురారీ' 4K మూవీని ఆగస్టు 9న గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ ఎన్నడూ లేనంతగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అదే రోజున 'ఒక్కడు' చిత్రాన్ని కొన్ని థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత ఎంఎస్ రాజు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన 'ఇంద్ర' సినిమాని రీరిలీజ్ చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.

కింగ్ అక్కినేని నాగార్జున బర్త్ డే కానుకగా ఆగస్టు 29న 'శివ' చిత్రాన్ని రీరిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీని 4K రిజల్యూషన్ లో విడుదల చేయమని ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నారు. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగ్, లారెన్స్ కాంబోలో వచ్చిన 'మాస్' మూవీని విడుదల చెయ్యమని కొందరు నెటిజన్లు ఎక్స్ లో నాగచైతన్యకు రిక్వెస్టులు పెడుతున్నారు.

అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తారీఖున 'గబ్బర్ సింగ్' సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక మాస్ మహారాజా రవితేజ, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన 'విక్రమార్కుడు' చిత్రాన్ని 4కే రిజల్యూషన్‌తో ఈనెల 27న రీ-రిలీజ్ చేయనున్నారు. ఇలా నెల రోజుల గ్యాప్ లోనే చాలా పాత సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాయి.

నిజానికి ఈ మధ్య కాలంలో రీ-రిలీజులకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఎంత మంచి సినిమా అయినా సరే, ఒకప్పటిలాగా ఎగబడి చూడటానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపించడం లేదు. కామన్ ఆడియన్స్ అసలు పట్టించుకోవడం మానేశారు. జనాలకు మొహం మొత్తడం, డిమాండ్ తగ్గిపోవడంతో కొన్నాళ్లపాటు రీరిలీజులకు బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటనలు వస్తున్నాయి.

అయితే మార్కెట్ లో కంటెంట్ లేకపోవడం వల్లనే పాత సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో 'కల్కి 2898 AD' మినహా ఏ మూవీ కూడా సక్సెస్ సాధించలేదు. దీనికి ఆడియెన్స్ కోరుకునే సరైన కంటెంట్ రాకపోవడం ఒక కారణమైతే, చిన్నా చితకా చిత్రాల కోసం జనాలు థియేటర్లకు తరలి రాకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. అందుకే ఒకప్పుడు హిట్టయిన పాత చిత్రాలనే జనాల మీదకు ఒదులుతున్నారనే మాట సోషల్ మీడియాలో వినబడుతోంది.

చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి అగ్ర హీరోల నుంచి ఇప్పుడప్పుడే కొత్త సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. అందుకే ఇప్పుడు పాత చిత్రాలను మరోసారి విడుదల చేసి, క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఓల్డ్ కంటెంట్ తో సినిమా హాల్స్ కు రప్పిస్తారేమో చూడాలి.