మైథాలాజీపై మక్కువ చూపిస్తున్న టాలీవుడ్!
ఏదైనా ఒక జోనర్ లో వచ్చిన సినిమా సక్సెస్ అయితే, అందరూ అలాంటి కథలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు
By: Tupaki Desk | 18 July 2024 5:24 AM GMTఏదైనా ఒక జోనర్ లో వచ్చిన సినిమా సక్సెస్ అయితే, అందరూ అలాంటి కథలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. దీంతో కొన్నాళ్లపాటు అదే ట్రెండ్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫిక్షనల్ మైథాలజీ సినిమాలు, సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గత రెండు మూడేళ్ళుగా ఇలాంటి జోనర్స్ లోనే ఎక్కువ చిత్రాలు రూపొందుతున్నాయి.
ఇటీవల కాలంలో తెలుగులో పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతలు, దైవత్వం, ఆధ్యాత్మికం.. నేపథ్యంలో అనేక సినిమాలు తెరకెక్కాయి. వాటిల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లు కొట్టినవే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'హను-మాన్' మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హనుమంతుడిని ఇండియన్ రియల్ సూపర్ హీరోగా ప్రజెంట్ చేసిన ఎపిక్ మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'హనుమాన్' మూవీ హిట్టయిన తర్వాత 'జై హనుమాన్' పేరుతో సీక్వెల్ ను ప్రకటించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈ ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందని తెలిపారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రంతో ఘన విజయం అందుకున్నారు. మహాభారతానికి భవిష్యత్ కాలానికి ముడిపెడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు. అశ్వద్ధామ, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు వంటి పాత్రలను తెర మీదకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచారు.
'కల్కి' సినిమాకి అన్ని భాషల్లోనూ అనూహ్య స్పందన లభించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ₹1000 కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు అంతా కల్కి పార్ట్-2 కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్నారు. ఇది పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. దర్శకుడు వశిష్ఠ దీనికి మైథాలజీ టచ్ ఇస్తున్నట్లుగా టాక్.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో 'అఖండ 2' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో శివుడు, అఘోరాలు, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. సెకండ్ పార్ట్ లోనూ శివుడి నేపథ్యం ప్రధానంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణుడు, కృష్ణతత్వం చుట్టూ అల్లుకున్న మిస్టరీలతో 'కార్తికేయ 2' సినిమా వచ్చింది. దీనికి కొనసాగింపుగా నిఖిల్ సిద్ధార్థ్, చందు మొండేటి కాంబినేషన్ లో త్వరలోనే 'కార్తికేయ 3' తెరకెక్కనుంది.
లేటెస్టుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న 'దేవకీ నందన వాసుదేవ్' సినిమాలో కూడా మైథలాజికల్ టచ్ ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, కృష్ణుడు పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుందని అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మైథలాజికల్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి కాబట్టి, టాలీవుడ్ లో ఇంకొన్నాళ్ళు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయో వేచి చూడాలి.