Begin typing your search above and press return to search.

మనోళ్లు వదిలేశారు.. వాళ్లు తుస్సుమనిపించారు

సంక్రాంతి, దసరా తర్వాత తెలుగు వారికి పెద్ద పండుగ దీపావళి. కానీ మన దగ్గర మిగతా రెండు పండుగలప్పుడు ఉండే సినిమాల సందడి దీపావళికి ఉండదు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 1:30 PM GMT
మనోళ్లు వదిలేశారు.. వాళ్లు తుస్సుమనిపించారు
X

సంక్రాంతి, దసరా తర్వాత తెలుగు వారికి పెద్ద పండుగ దీపావళి. కానీ మన దగ్గర మిగతా రెండు పండుగలప్పుడు ఉండే సినిమాల సందడి దీపావళికి ఉండదు. దీపావళికి తెలుగులో పెద్ద సినిమాలు రిలీజవడం అరుదు. ఐతే ప్రతి సంవత్సరం మిడ్ రేంజ్ సినిమాల సందడైనా ఉండేది కానీ.. ఈసారి అదీ లేకపోయింది. ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాని అరుదైన దీపావళి ఇదే కావచ్చు. ఉన్న ఒక్క సినిమా ‘ఆదికేశవ’ను వాయిదా వేసేసిన సంగతి తెలిసిందే. కనీసం డబ్బింగ్ సినిమాలైనా వస్తున్నాయిలే అని సినీ ప్రియులు ఆశతో ఉన్నారు. కానీ దీపావళికి వచ్చిన మూడు క్రేజీ అనువాద చిత్రాలు కూడా తీవ్ర నిరాశకు గురి చేశాయి.


దీపావళికి అత్యధిక అంచనాలతో వచ్చిన సినిమా ‘జపాన్’. కార్తికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ సంగతి తెలిసిందే. తన సినిమా బాగుంటే స్ట్రెయిట్ సినిమాల తరహాలో ఆదరిస్తారు. కథల ఎంపికలో మంచి పేరున్న కార్తి.. తన 25వ సినిమాకు చాలా స్పెషల్ అనిపించే కథనే ఎంచుకుని ఉంటాడనుకున్నారు. కానీ ‘జపాన్’ సినిమా చూసి అందరూ షాకైపోయారు. మైల్‌స్టోన్ మూవీకి ఇలాంటి కథ ఎంచుకున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. మార్నింగ్ షోలతోనే ‘జపాన్’ డిజాస్టర్ అని తేలిపోయింది. మరో తమిళ అనువాద చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ దీంతో పోలిస్తే కొంచెం బెటరే కానీ.. చివరి అరగంటలో మెరుపుల కోసం మిగతా రెండున్నర గంటలు సినిమాను భరించడం కష్టమే. తమిళంలో ఓ మోస్తరుగా ఆడుతున్న ఈ చిత్రం తెలుగులో తుస్సుమనిపించేసింది. ఇక ప్రేక్షకుల చివరి ఆశ.. టైగర్-3నే. సల్మాన్ ఖాన్ నటించిన ఈ భారీ బాలీవుడ్ చిత్రం కూడా నెగెటివ్ టాకే తెచ్చుకుంది. ఆదివారం రెస్పాన్స్ బాగున్నా.. సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడే పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే దీపావళి పండుగ తెలుగు సినిమాలు లేక, అనువాద చిత్రాలు ఆడక వెలవెలబోతోందనే చెప్పాలి.