ఆ స్టార్స్ ఇక పాన్ ఇండియాకే అంకితమా?
రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ లో పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.
By: Tupaki Desk | 3 May 2024 2:30 PM GMT'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్ కేవలం పాన్ ఇండియా చిత్రాలే చేస్తోన్న సంగతి తెలిసిందే. 'సాహో'.. 'రాధేశ్యామ్'.. 'ఆదిపురుష్'.. 'సలార్' అన్నీ పాన్ ఇండియాలో రిలీజ్ అయినవే. ప్రస్తుతం చేస్తోన్న 'కల్కీ 2898'.. 'సలార్-2'.. కమిట్ అయిన ఇతర ప్రాజెక్ట్ లు అన్నీ పాన్ ఇండియా రిలీజ్ లే. మరి డార్లింగ్ తర్వాత పాన్ ఇండియా స్టార్లుగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే వేలో పాన్ ఇండియా సినిమాలకే అంకితమవుతారా? తెలుగు మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆ తరహా సినిమాలు చేస్తారా? అన్నది సస్పెన్స్.
ప్రస్తుతానికైతే చరణ్...ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతుంది. అటుపై బుచ్చిబాబుతో చేయనున్న 16వ చిత్రం కూడా పాన్ ఇండియా రిలీజ్. 17వ చిత్రం సుకుమార్ తో చేస్తున్నాడు. ఇది కూడా ఇండియా సినిమా గానే రిలీజ్ అవుతుంది. ఇక యంగ్ టైగర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' లో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ లో పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.
అటుపై వచ్చే ఏడాది రెండవ భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ -2' లోనూ తారక్ నటిస్తున్నాడు. ఇది టైగర్ బాలీవుడ్ డెడ్యూ. ఈ రెండింటి తర్వాత ప్రశాంత్ నీల్ తోనూ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. కానీ చరణ్..ఎన్టీఆర్..ప్రభాస్ ముగ్గురు తెలుగు రాష్ట్రాల్లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. ఇక్కడ మార్కెట్ నుంచే సునాయాసంగా 200 కోట్ల వసూళ్లు రాబట్టగలరు. మరి వాళ్లకోసమంటూ మాస్ కంటెంట్ ని మళ్లీ టచ్ చేస్తారా? లేక అభిమానుల్లోనే మార్పు తీసుకొస్తారా? అన్నది చూడాలి.
అలాగే సూపర్ స్టార్ మహేష్ కూడా రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. ఇతడికి గతంలోనే బాలీవుడ్ అవకాశాలెన్నో వచ్చాయి. కానీ తెలుగు సినిమాలు తప్ప హిందీ సినిమాలు చేయనని కరాకండీగా చెప్పేసారు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులున్నారని..ఇక్కడ నుంచే సినిమాలు చేస్తానని అన్నారు. మరిప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న తరుణంలో తీసుకున్న పాత నిర్ణయంలో కొత్త మార్పులేమైనా వస్తాయా? లేక పాన్ ఇండియా...తెలుగు రాష్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతారా? అన్నది చూడాలి.