Begin typing your search above and press return to search.

ఆ మల్టీస్టారర్ రాసే రైటర్లే లేరా..?

టాలీవుడ్ నాలుగు స్థంభాలుగా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వారి ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే.

By:  Tupaki Desk   |   27 Jan 2024 5:30 AM GMT
ఆ మల్టీస్టారర్ రాసే రైటర్లే లేరా..?
X

టాలీవుడ్ నాలుగు స్థంభాలుగా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వారి ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎదిగింది అంటే అది వారు చేసిన సినిమాల వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అభిమాన జనమే వారిని ఇన్నేళ్ల సినీ ప్రస్థానాన్ని కొనసాగించేలా ముందుకు నడిపించింది. అయితే టాలీవుడ్ లో ఈ నలుగురు కలిసి స్టేజ్ మీద కనిపిస్తేనే ఫ్యాన్స్ కి పండుగే అనిపిస్తుంది. అలాంటిది ఈ నలుగురు కలిసి సినిమా చేస్తే ఇక ఆ సినిమా రికార్డుల లెక్క వేరేలా ఉంటుంది.

చిరు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురిని ఒక సినిమాలో చూపించాలని మెగా మల్టీస్టారర్ సినిమా చేయాలని ఇప్పుడు కాదు కొన్ని ఏళ్లుగా పయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. దశాబ్దాల కాలంగా ఉన్న స్టార్ రైటర్స్ కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలని అనుకుని ఎక్కడో ఒకచోట కథ కుదరక వదిలేశారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది కొత్త రైటర్స్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వారి గురి ఈ నలుగురిని కలిపి తీసే మల్టీస్టారర్ మీద పడింది.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ నలుగురి స్టార్స్ కి ఎవరి బలాలు వారివే.. వాటినన్నిటినీ టచ్ చేస్తూ ఒక కథ రాస్తే అదిరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తర్వాత కొంతకాలం ఆ ట్రెండ్ కొనసాగింది. కానీ మధ్యలో స్టార్ హీరోలు ఎవరికి వారు తమ స్థాయిని పెంచుకుంటూ వెళ్లారు. ఇద్దరు స్టార్స్ కలిసి సినిమా చేయడం అంటే హీరో ఎవరు విలన్ ఎవరు అనే గొడవ ఫ్యాన్స్ లో మొదలవుతుంది. అందుకే ఈ గొడవలకు తావివ్వకూడదని ఇలాంటి కథలను రాయడమే పక్కన పెట్టేశారు.

అయితే ఆర్.ఆర్.ఆర్ తో మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఊపు వచ్చింది. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ నలుగురిని ఒక సినిమాలో నటింపచేయాలని దర్శ నిర్మాతలు ఆరాటపడుతున్నారు. కొత్త రైటర్స్ ఎవరైనా సరే ఇలాంటి కథ రెడీ చేస్తే దాని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి ఈ మల్టీస్టారర్ అసలు సాధ్యమయ్యే పనేనా.. ఆ నలుగురు కలిసి ఒక వేదిక మీదకు రావడమే ఎక్కువ అనుకుంటున్న ఈ టైం లో ఒక సినిమాలో నటించడం జరుగుతుందా అన్నది చూడాలి.