Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలను కొట్టేవారే లేరు!

టాలీవుడ్ లో ప్రస్తుతం రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమాలు తీసే అగ్ర హీరోలు ఏడుగురు ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 July 2024 11:30 AM GMT
టాలీవుడ్ హీరోలను కొట్టేవారే లేరు!
X

ఇటీవల కాలంలో 'తెలుగు సినిమా' మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. మన చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు రాబడుతూ, బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లను సాధిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. మిగతా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలు మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోడానికే కష్ట పడుతుంటే, టాలీవుడ్ స్టార్స్ మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. దీంతో మన హీరోల రేంజ్ పూర్తిగా మారిపోయింది. మనోళ్లపై ఖర్చు చేసిన బడ్జెట్ కి రెట్టింపు కలెక్షన్స్ తెస్తుండటంతో, కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమాలు తీసే అగ్ర హీరోలు ఏడుగురు ఉన్నారు. వీరిలో మెగా ఫ్యామిలీ నుంచే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి నలుగురు స్టార్స్ ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మరో ముగ్గురు స్టార్ హీరోలున్నారు. వీళ్లంతా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడమే కాదు, అదే స్థాయిలో మార్కెటింగ్ చేసి బిజినెస్ చేయగలుగుతారు. సినిమా ఎలా ఉన్నా సరే, టాక్ తో సంబంధం లేకుండా కేవలం తమ స్టార్ డమ్ తోనే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను పెడుతుంటారు.

రెబల్ స్టార్ ప్రభాస్ నే తీసుకుంటే 'బాహుబలి 2'తో వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టారు. 'సలార్' తో 700 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు లేటెస్టుగా 'కల్కి'తో మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు RRR మూవీతో వెయ్యి కోట్ల మైల్ స్టోన్ మార్క్ ను క్రాస్ చేసారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా.. తన స్టార్ పవర్ తో రెండు వందల యాభై కోట్ల వరకూ గ్రాస్ రాబట్టగలిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 1' చిత్రంతో 350 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో 200 కోట్ల క్లబ్ లో చేరారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ లాంటి హీరోలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరారు. ఇక తెలుగులో 100 కోట్లు కలెక్ట్ చేసే యంగ్ హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, సిద్ధూ జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా వంటి హీరోలు సైతం మంచి సినిమా పడితే ఈజీగా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తున్నారు.

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టే స్టామినా ఉన్న ఇంతమంది స్టార్స్ మన ఒక్క తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నారు. తమిళ్ లో రజనీకాంత్, విజయ్, అజిత్ కుమార్ లాంటి ముగ్గురు నలుగురు స్టార్ హీరోలున్నారు. కన్నడలో KGF హీరో యశ్ ఒక్కడే ఉన్నాడు. మలయాళంలో ఎక్కువగా లిమిటెడ్ బడ్జెట్ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తీస్తుంటారు కాబట్టి, వాళ్ళ స్టార్ డమ్ ను లెక్కలోకి తీసుకోలేం. ఇక బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే రాణిస్తున్నారు.

ఇలా మిగతా ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే, టాలీవుడ్ లో మాత్రమే ఎక్కువమంది స్టార్స్ ఉన్నారు. తమ స్టార్ డమ్ తో ఇండియన్ సినిమాపై కంప్లీట్ డామినేషన్ చూపిస్తున్నారు. ఈ విషయంలో ఇతర భాషల హీరోలు మన స్టార్స్ కు కనీస పోటీ ఇవ్వలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు హీరోల నుంచి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలే. పాన్ ఇండియా వైడ్ గా అందరిలో మంచి అంచనాలున్నాయి. వీటిల్లో కొన్ని హిట్టయినా బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. అదే జరిగితే ఇంకొన్నేళ్లు భారతీయ చిత్ర పరిశ్రమలో 'తెలుగు సినిమా' ఆధిపత్యం ఇలానే కొనసాగుతుంది.