టాలీవుడ్.. మళ్లీ ఎన్ని రోజులకో ఇలా..
ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్.. దీంతో వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎన్నడూ లేనంతగా దారుణంగా మారింది.
By: Tupaki Desk | 15 Jun 2024 6:14 AM GMTఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్.. దీంతో వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎన్నడూ లేనంతగా దారుణంగా మారింది. దేవర, కల్కి వంటి బడా హీరోల సినిమాలను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. మిడ్ రేంజ్ హీరోల చిత్రాలు భయపడి వెనక్కి వెళ్లాయి. కొన్ని చిన్న చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా మూవీ లవర్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. అలా కొన్ని చోట్ల థియేటర్లు మూతపడ్డాయని కూడా వార్తలు వచ్చాయి.
అయితే గత నెలలో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మళ్లీ మొదలైంది. మే చివరి వారంలో ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రెండు చిత్రాలు మంచి టాక్ అందుకున్నాయి. ఆ తర్వాత గత వారం శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళి సినిమాలు విడుదలయ్యాయి. మనమే పాజిటివ్ టాక్ దక్కించుకుని సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది.
ఇక ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. సుధీర్ బాబు హరోం హర, అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి, విజయ్ సేతుపతి మహారాజ, చాందినీ యేవమ్, ఇంద్రాణితో పాటు మరిన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే హరోం హర, మ్యూజిక్ షాప్ మూర్తి, మహారాజ సినిమాలు చెప్పుకోదగ్గ మంచి టాక్ దక్కించుకున్నాయి. ఒక్కో సినిమా ఒక్కో విధంగా పాజిటివ్ టాక్ అందుకుంది.
దీంతో చాలా రోజులకు టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి కనిపించింది.
సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన హరోం హర యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా యాక్షన్ ప్రియులను తెగ అలరిస్తోంది. ముందు రోజు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ కు వచ్చిన డీసెంట్ టాక్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. నటుడు అజయ్ ఘోష్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి.. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా గుర్తింపు సంపాదించుకుంది. అజయ్ ఘోష్ యాక్టింగ్ హైలెట్ గా నిలవగా.. సినిమా కాన్సెప్ట్ ను అభినందించాల్సిందే.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమా మూవీ లవర్స్ ను అలరిస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు నెలకొన్న అంచనాలను అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మేకింగ్ తో పాటు విజయ్ సేతుపతి యాక్టింగ్ కు అంతా ఫిదా అవుతున్నారు. థియేటర్లకు ఆడియన్స్ తరలి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు కాకుండా మిగతా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ మూడు చిత్రాలకు మంచి వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.