Begin typing your search above and press return to search.

2024 లో పూర్తి డామినేషన్ మనదేనా ?

బాహుబలి సినిమాలు - RRR భారీ విజయం తర్వాత, దర్శకుడు SS రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:30 PM GMT
2024 లో పూర్తి డామినేషన్ మనదేనా ?
X

RRR చిత్రంతో టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ల‌లో దూసుకుపోగ‌ల‌ద‌ని ప్రూవ్ అయింది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల‌ను గెల‌వ‌డ‌మే గాక‌, ప‌లు దేశాల్లో విడుద‌లైన‌ ఈ చిత్రం అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది. ఆర్.ఆర్.ఆర్ కొత్త మార్కెట్ల‌ను అన్వేషించడం కొత్త ఆశ‌ల‌కు జీవం పోసింది. బాహుబ‌లి- బాహుబ‌లి2- కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్‌ త‌ర్వాత పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ ఒక‌ ఉద్య‌మంలా మారింది. ఇక ఇదే హుషారులో త‌దుప‌రి టాలీవుడ్ నుంచి రెండు భారీ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రాలు సంచ‌ల‌నాలు న‌మోదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయనేది ఒక అంచ‌నా. ఈ కోణంలో మ‌రింత‌గా విశ్లేషిస్తే..

భారతీయ సినిమా ముఖ్యంగా టాలీవుడ్ సినిమా మరింత పెద్దదవుతోంది. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రం అనే ట్యాగ్ టాలీవుడ్ నుంచే వినిపిస్తోంది. ఈ ట్యాగ్ ఒక మెగా ప్రాజెక్ట్ నుండి మరొక ప్రాజెక్ట్‌కి మారుతూ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇది దాదాపు ఎల్లప్పుడూ బాలీవుడ్ చిత్రం అని భావించేవారు. కానీ ఇటీవ‌ల అతిపెద్ద భారతీయ చిత్రం అని భాష‌తో సంబంధం లేకుండా మీడియాలు కూడా ప్ర‌స్థావిస్తున్నాయి. బాహుబలి అన్నిటినీ మార్చింది. బాహుబ‌లి సినిమాలు- ఆర్.ఆర్.ఆర్ తెలుగు పరిశ్రమ నుండి వ‌చ్చి ఒక భారతీయ చిత్రానికి అత్యధిక బడ్జెట్‌గా రికార్డ్‌ను సృష్టించాయి. 2024లో ఈ రికార్డును మళ్లీ బద్దలు కొట్టాలి. ఈసారి 1000 కోట్ల మార్క్ బ‌డ్జెట్ సినిమాలను టాలీవుడ్ నుంచి ఊహించ‌వ‌చ్చు.

బాహుబలి సినిమాలు - RRR భారీ విజయం తర్వాత, దర్శకుడు SS రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టును అందిస్తున్నారు. ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్‌లో స్క్రీన్ రైటర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రంపై రచన ప్రారంభమైందని.. ఇది ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద భారతీయ చిత్రం అవుతుందని తెలియజేశారు. దీనిని తాత్కాలికంగా SSMB29 అని పిలుస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ బ‌డ్జెట్ ని దీనికోసం కేటాయించ‌నున్నార‌న్న చ‌ర్చ బ‌లంగా వినిపిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

SSMB29 కోసం రూ. 1000-కోట్ల బడ్జెట్ కేటాయిస్తే..ఇప్పటివరకు తీసిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగానే కాకుండా రాజమౌళిమునుపటి రెండు చిత్రాలైన RRR (రూ. 500 కోట్లు).. బాహుబలి 2 (రూ. 250 కోట్లు) కలిపి ఖర్చుల కంటే ఎక్కువ పెట్టుబ‌డి అవుతుంది.

మ‌రోవైపు ప్రభాస్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిస్తున్న `కల్కి 2898 AD` చిత్రాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇదివ‌ర‌కే పాన్ వ‌రల్డ్ సినిమా అని పిలిచారు. దీనికోసం రూ. 600 కోట్ల బడ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఈ సినిమాని పాన్ వ‌ర‌ల్డ్ లో రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా తెర‌కెక్కిస్తున్నారు గ‌నుక ఖ‌ర్చు అంత‌కుమించి అయ్యేందుకు ఆస్కారం లేక‌పోలేదు. క‌ల్కి చిత్రం క‌థాంశం యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో ఉన్న‌ది. ఫాంట‌సీ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో భ‌విష్య‌త్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించ‌నున్న ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. అలాగే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప 2.. కొర‌టాల శివ రూపొందిస్తున్న‌ దేవర కోసం సుమారు 250 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. ఇవి రెండూ పాన్ వ‌ర‌ల్డ్ లో సెన్సేష‌న్స్ సృష్టిస్తాయ‌ని 1000 కోట్ల క్ల‌బ్ వ‌సూళ్ల‌తో అద‌ర‌గొడ‌తాయ‌ని అభిమానుల్లో అంచ‌నాలున్నాయి. బాలీవుడ్ లో సింగం ఎగైన్, ఫైటర్ చిత్రాల బ‌డ్జెట్లు రూ. 250-300 కోట్ల రేంజ్‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

SSMB29 పీరియాడికల్ డ్రామా కాదని, వ‌ర్త‌మానంలో సాగే క‌థాంశంతో రూపొందుతుంద‌ని రచయిత విజ‌యేంద్రుడు ఇంత‌కుముందు ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని హాలీవుడ్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ జాన‌ర్‌తో పోల్చాడు. మహేష్ బాబు ఇండీ లాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఎంఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ స్కోర్ కంపోజింగ్‌ను ప్రారంభించాడు. రాజమౌళి సరైన సమయంలో సినిమా థీమ్ ని ప్రెస్ మీట్‌లో వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నందున, అది సెట్స్ కెళ్లేందుకు కొంత స‌మ‌యం పట్టవచ్చు.

నిజానికి ఇప్ప‌టివ‌ర‌కూ 500 కోట్లు అంత‌కుమించిన బ‌డ్జెట్ తో బాలీవుడ్ లో సినిమాలు తెర‌కెక్క‌లేదు. 250-300 కోట్ల బ‌డ్జెట్ రేంజులోనే అక్క‌డ సినిమాల్ని తెర‌కెక్కించారు. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ `మ‌హాభార‌తం` సిరీస్ ని దాదాపు 1000 కోట్ల‌తో తెరకెక్కించేందుకు రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో చ‌ర్చించారు. కానీ ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా మూల‌న‌ప‌డింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ 1000 కోట్ల బ‌డ్జెట్ సినిమాలేవీ ఇండియాలో తెర‌కెక్క‌లేదు.