కుర్ర హీరోల మీద అన్ని కోట్లు వర్కౌట్ అయ్యేనా?
రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ, ఎన్నడూ లేనంత స్పీడ్ లో దూసుకుపోతున్నారు
By: Tupaki Desk | 2 Aug 2024 5:18 AM GMTటాలీవుడ్ టైర్-2, యంగ్ హీరోలంతా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ, ఎన్నడూ లేనంత స్పీడ్ లో దూసుకుపోతున్నారు. మన నిర్మాతలైతే హీరోల మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. గత చిత్రాల బాక్సాఫీస్ లెక్కలు పరిగణనలోకి తీసుకోకుండా కుర్ర హీరోల మీద కోట్లు కుమ్మరిస్తున్నారు.
'కార్తికేయ' హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం 'స్వయంభూ' అనే పాన్ ఇండియా పీరియడ్ మూవీలో నటిస్తున్నాడు. ఇది అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. కేవలం 12 రోజుల పాటు షూట్ చేసిన ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసమే 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో పాటుగా నిఖిల్ 'ది ఇండియా హౌస్' అనే సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాదాపు 80 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఖర్చు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ అంటున్నారు.
హనుమాన్ ఫేమ్ తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా అడ్వెంచర్ మూవీ 'మిరాయ్'. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి దాదాపు ₹60 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అఖిల్ చివరి సినిమా 'ఏజెంట్' కోసం 80 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇది బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా మారింది. అయినా సరి అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ మీద భారీ బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ధీర అనే టైటిల్ తో ప్రచారం చేయబడుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి 100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని వార్తలు వస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే 'SDT 18' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పెద్ద సినిమా అనౌన్స్ చేశారు. దీనికి 100 - 125 కోట్ల వరకూ బడ్జెట్ అంచనాలు వేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. ఇది అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ ఫిల్మ్. ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో పాత వైజాగ్ సిటీ సెట్ వేశారు. 35 రోజుల షూటింగ్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న BSS 11, BSS 12 రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలే.
నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' సినిమాకి 85 - 90 కోట్లు బడ్జెట్ అయిందని టాక్. అక్కినేని నాగచైతన్య చేస్తున్న 'తండేల్' మూవీకి 70 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని నిర్మాత బన్నీ వాస్ ఇటీవలే తెలిపారు. విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న మూడు చిత్రాలూ భారీ బడ్జెట్ తో తీస్తున్నవే. నితిన్ హీరోగా నటిస్తున్న 'తమ్ముడు' సినిమాలో 10 రోజుల యాక్షన్ సీక్వెన్స్ కోసం 8 కోట్ల రూపాయలు అయింది. నందమూరి కల్యాణ్ రామ్ కొత్త మూవీ క్లైమాక్స్ కోసం 8 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సుధీర్ బాబు ఈ మధ్యనే హిందీ ప్రొడ్యూసర్స్ తో ఓ పాన్ ఇండియా మూవీ కమిట్ అయ్యారు. ఇది ఆయన కెరీర్ లోనే పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉంది.
ఇలా తెలుగు మీడియం రేంజ్ హీరోలు, యువ కథానాయకులు అందరూ ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. అయితే నిర్మాతలు ఆ హీరోల మార్కెట్ ని బట్టి కాకుండా, కంటెంట్ ని నమ్ముకునే భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ మీద ఎంత వచ్చినా.. ఓటీటీ డీల్స్, శాటిలైట్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ వంటి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో పెట్టుబడి వెనక్కి వస్తుందనే ధీమాతో ఖర్చుకు వెనకాడటం లేదని అర్థమవుతోంది. మరి ఈ చిత్రాలన్నీ నిర్మాతలకు ఎలాంటి లాభాలు మిగులుస్తాయో చూడాలి.