Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ని శాసిస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మలు!

అందుకే అందం, అభినయంతో పాటుగా కూసింత అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 3:45 AM GMT
టాలీవుడ్ ని శాసిస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మలు!
X

టాలీవుడ్ లో కావలసినంత మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వారానికో కొత్త కథానాయిక పరిచయమయ్యే తెలుగు ఇండస్ట్రీలో 'స్టార్ స్టేటస్' అందుకోవడం మామూలు విషయం కాదు. అందుకే అందం, అభినయంతో పాటుగా కూసింత అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవాల్సిందే అనే విధంగా.. కొత్త హీరోయిన్ల హవా మొదలైతే సీనియర్ హీరోయిన్లు కూడా ఆఫర్ల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక సీనియర్ భామ, ఇద్దరు యంగ్ బ్యూటీల డామినేషన్ కొనసాగుతోంది. వాళ్లెవరో కాదు.. రష్మిక మందన్న, శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి.


లేటెస్టుగా 'పుష్ప 2: ది రూల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్.. పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో అర డజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. వాటిల్లో నాలుగు చిత్రాలు వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ త్రైలింగ్విల్ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలానే రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే బైలింగ్వల్ సినిమా చేస్తోంది.

మరోవైపు హిందీలో రష్మిక మందన్న 'సికందర్' మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2025 ఈద్ స్పెషల్ గా రిలీజ్ కానుంది. విక్కీ కౌశల్ కు జోడీగా 'ఛావా' అనే హిస్టారికల్ మూవీ చేస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. దీంతో పాటుగా ఆయుష్మాన్ ఖురానా సరసన 'థమా' అనే హార్రర్ కామెడీ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. 'స్త్రీ 2' మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఇక ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంతో తెలియదు కానీ.. 'యానిమల్ పార్క్' వంటి క్రేజీ సీక్వెల్ రష్మిక లైనప్ లో ఉంది. మరికొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ఫుల్ డిమాండ్ ఉన్న మరో హీరోయిన్ శ్రీలీల. ఆ మధ్య కాస్త స్లో అయిన ఈ కుర్ర భామ.. మళ్ళీ స్పీడ్ అందుకుంది. ఎప్పటిలాగే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అయింది. ఇటీవలే పుష్ప-2లో 'కిస్సిక్' సాంగ్ తో పాన్ ఇండియాని షేక్ చేసిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రవితేజ సరసన 'మాస్ జాతర' అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. నితిన్ కు జంటగా అమ్మడు నటించిన 'రాబిన్‌హుడ్' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న 'Akhil 6' మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది.

అలానే మరో అక్కినేని వారసుడు నాగచైతన్య సరసన 'NC 24' సినిమా కమిట్ అయింది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల ఒక కథానాయికగా కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సిద్ధూ జొన్నలగడ్డతో ఓ మూవీ సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో తమిళ్ లో ఎంట్రీ ఇవ్వడానికి శ్రీలీల రెడీ అయింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న 'SK 25' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.

ప్రెజెంట్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి అని చెప్పాలి. 2024లో ఆరు సినిమాలతో ఆడియన్స్ ను అలరించింది. 'గుంటూరు కారం', 'ది గోట్', 'లక్కీ భాస్కర్' వంటి హిట్ మూవీస్ ఉన్నాయి. సీనియర్ హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి రానున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఒక కథానాయికగా కనిపించనుంది. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి పక్కన 'అనగనగా ఒక రాజు' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటుగా తెలుగులో మరో రెండు కొత్త చిత్రాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అలానే కొన్ని తమిళ సినిమాలకు కూడా సైన్ చేస్తోంది మీనాక్షి.

ఇలా రష్మిక మందన్న, శ్రీలీల, మీనాక్షి చౌదరి.. ముగ్గురూ వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి చేతిలో అర డజనుకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చూస్తుంటే 2025లోనూ ఈ అందాల భామల డామినేషన్ ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. మరి వచ్చే ఏడాది వీళ్ళకి పోటీగా ఏయే హీరోయిన్లు వస్తారో చూడాలి.