Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - నీల్ సినిమాలో మిన్నల్ మురళి..?

'దేవర' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్‌ 2' షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు

By:  Tupaki Desk   |   8 Jan 2025 2:30 PM GMT
ఎన్టీఆర్ - నీల్ సినిమాలో మిన్నల్ మురళి..?
X

'దేవర' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్‌ 2' షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రెగ్యులర్‌ షూట్ కి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన న‌టీన‌టుల ఎంపిక కూడా పూర్తవుతోందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా నేపథ్యం గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

'NTR Neel' అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీనికి 'డ్రాగన్' అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రచారంలో ఉంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969, గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీంతో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని, సినిమా కథంతా డ్ర‌గ్ మాఫియా చుట్టూ తిరుగుతుంద‌ని వార్తలు వస్తున్నాయి.

భౌగోళికంగా ఈశాన్య మయన్మార్ (బర్మా), వాయువ్య థాయిలాండ్, ఉత్తర లావోస్‌లో విస్తరించి ఉన్న అతి పెద్ద పర్వత ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో కొకైన్‌, గంజాయి ఎక్కువ‌గా స్మ‌గ్లింగ్ అవుతుంటుంది. 1950-60లలో ప్రపంచంలోని అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది. అందుకే దాన్ని డ్రగ్ క్యాపిటల్ గా కూడా పేర్కొంటారు. గోల్డెన్ ట్రయాంగిల్ లో జరిగే స్మగ్లింగ్ కార్యకలాపాలు, నార్కోటిక్స్ ట్రాఫికర్స్‌ అరాచ‌కాలు, అక్ర‌మాల నేప‌థ్యంలోనే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ KGF, సలార్ సినిమాల తరహాలోనే తారక్ తో డార్క్ థీమ్ తో ఈ పీరియడ్ యాక్షన్‌ మూవీ రూపొందిస్తారని తెలుస్తోంది.

RRR స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో ఈ పాన్ ఇండియా సినిమా తీయడానికి దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ రంగం సిద్థం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర భాషలకు చెందిన పలువురు పాపులర్ స్టార్స్ ని తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మ‌ల‌యాళం నుంచి బీజూ మీన‌న్‌, టోవినో థామ‌స్‌ లను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలానే 'సప్తసాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వ‌సంత్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఓటీటీ సినిమాల ద్వారా టోవినో థామ‌స్‌ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన నటించిన 'ఫోరెన్సిక్' 'మాయానది' 'కాలా' 'మిన్నల్ మురళి' 'తల్లుమాల', 2018, ARM వంటి చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని టోవినో స్వయంగా తెలిపారు. మరోవైపు 'భీమ్లా నాయక్' ఒరిజినల్ వెర్షన్ తో నేషనల్ అవార్డ్ అందుకున్న బీజూ మీన‌న్‌ సైతం డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో అలరించారు. ఇప్పుడు వీరిద్దరూ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో భాగం అవుతున్నారని అంటున్నారు. నీల్ గత చిత్రాలకు వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ నే రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

NTR Neel సినిమా షూటింగ్ ను జనవరి నెలాఖ‌రున ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆగ‌స్టు నాటికి చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని అంటున్నారు. 2026 సంక్రాంతి స్పెషల్ గా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పూజ జరిపిన రోజునే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించబడతాయి.