Begin typing your search above and press return to search.

అంతా మావైపే వేలెత్తి చూపిస్తే బాధ‌గా ఉంది!

తాజాగా మ‌ల‌యాళ హీరో టోవినో థామ‌స్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. 'క‌మిటీతో నేను మాట్లాడాను. మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లోనే ఈ క‌మిటీ ఏర్పాటు చేసారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 7:30 PM GMT
అంతా మావైపే వేలెత్తి చూపిస్తే బాధ‌గా ఉంది!
X

మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ లైంగిక వేధింపుల‌కు సంబంధించి జ‌స్టిస్ హేమ క‌మిటీ ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. నివేదిక‌లో నివ్వెర పోయే విష‌యాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయి. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ లో ఇంత దారుణ‌మైన కీచ‌కులు ఉన్నారా? అని దేశ‌మంతా చ‌ర్చించుకునే ప‌రిస్థితి త‌లెత్తింది. ఇప్ప‌టికే ఈ నివేదిక‌పై ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తాజాగా మ‌ల‌యాళ హీరో టోవినో థామ‌స్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. `క‌మిటీతో నేను మాట్లాడాను. మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లోనే ఈ క‌మిటీ ఏర్పాటు చేసారు. అందుకే ఇక్క‌డ ఇబ్బందులు గురించి మాట్లాడుతున్నాం.

ఒకవేళ ఇదే విధ‌మైన క‌మిటీని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏపరిశ్ర‌మ‌లోనైనా ఏర్పాటు చేసినా ఈ స‌మ‌స్య ప్ర‌తీ చోటా ఉంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసేది. అంద‌రూ ఇప్పుడు మా ప‌రిశ్ర‌మ‌లో ఇలా జ‌రుగుతుంద‌ని అంతా మాట్లాడుతుంటే బాధ‌గా ఉంది.

ఎందుకంటే నేను ఇదే ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తిని కాబ‌ట్టి. ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవడం లేదు. ఇక్కడ ప్ర‌తీ ఒక్క‌రూ వేధింపుల‌కు గురి చేసే వారు కాదు. క‌మిటీ నివేదిక‌లో అదే విష‌యాన్ని తెలియజేసింది. స్త్రీ లేదా పురుషుడు ఎవ‌రైనా స‌రే ఈ విధంగా ఇత‌రుల‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన‌ప్పుడు త‌ప్ప‌కుండా వారికి శిక్ష పడాలి. ఇలాంటివి మ‌రోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి` అని అన్నారు.

టోవినో థామ‌స్ 2018 సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇక్క‌డా మంచి విజ‌యం సాధించింది. అందులో టోవినో థామ‌స్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ప్ర‌స్తుతం న‌టుడిగా మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లోనే కొన‌సాగుతున్నాడు.