Begin typing your search above and press return to search.

ఆ ట్రెండులో తగ్గుతున్న సినిమాలు.. అందుకే ఈ పరిస్థితి!

పెట్టిన పెట్టుబడి మొత్తం వారం రోజుల్లోనే రాబట్టాలని నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ తీసుకున్న టిక్కెట్ల ధరల నిర్ణయాలు సినిమాకి ప్రేక్షకులని దూరం చేశాయనేది ఓ వర్గం కామెంట్.

By:  Tupaki Desk   |   24 May 2024 4:12 AM GMT
ఆ ట్రెండులో తగ్గుతున్న సినిమాలు.. అందుకే ఈ పరిస్థితి!
X

ప్రస్తుతం సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. టైర్ 1 హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలకి తక్కువ కాకుండా తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. యూనివర్శల్ కథలపైన మాత్రమే ఫోకస్ చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు. తద్వారా తమ మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు.

పాన్ ఇండియా కథలు అనేసరికి ఎంతసేపు హీరో ఇమేజ్ తో నడిచే కథలే దర్శనమిస్తున్నాయి. కొంతమంది హీరోలు తమకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని అలాగే కొనసాగించాలని సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నారు. మరికొంతమంది మార్కెట్ రేంజ్ మరింత పెంచుకొని గ్లోబల్ లెవల్ లో ఇంపాక్ట్ చూపించాలని భావిస్తున్నారు. ఈ కారణంగా సినిమా సినిమాకి సుదీర్ఘంగా గ్యాప్ తీసుకుంటున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఏడాది 3 నుంచి 4 సినిమాలు చేసేవారు. దీంతో సినీ కార్మికులకి ఏడాది మొత్తం పని దొరికేది. అలాగే థియేటర్స్ కూడా నిత్యం సినిమాలతో కళకళలాడుతూ ఉండేవి. టికెట్ ధరలు కూడా అందరికి అందుబాటులో ఉండటంతో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలకి ఎక్కువగా వెళ్తూ ఉండేవారు.

అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలు సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు. ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనం అయిపోతుంది. టైర్ 2 హీరోలు కూడా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఈ కారణంగా సినీ కార్మికులకి పని తగ్గిపోయింది, అదే సమయంలో థియేటర్స్ లలో టికెట్ ధరలు గణనీయంగా పెంచేశారు. మరోవైపు ఓటీటీ ప్రభావం, ఈ క్రమంలో ఆడియెన్స్ కు థియేటర్స్ కు మధ్య గ్యాప్ పెరుగుతోంది.

పెట్టిన పెట్టుబడి మొత్తం వారం రోజుల్లోనే రాబట్టాలని నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ తీసుకున్న టిక్కెట్ల ధరల నిర్ణయాలు సినిమాకి ప్రేక్షకులని దూరం చేశాయనేది ఓ వర్గం కామెంట్. ఇదే సమయంలో ఓటీటీలకి ఆదరణ పెరగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా పెద్ద సినిమాలు అయిన వారం రోజుల సందడి మాత్రమే ఉంటుంది.

చిన్న సినిమాలకి ఆదరణ లభించడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాలలో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లు నడవలేని స్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలంటే మరీ ఎక్కువగా గ్లోబల్ ఇమేజ్ కోసం పరుగులు పెట్టకుండా అప్పుడప్పుడు చిన్న బడ్జెట్ ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా చేయాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ మరికోన్నెల్ల పాటు ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నారు.