అన్షుని అలా అన్నందుకు అమ్మ వారం రోజులు బాధపడింది!
అన్షుని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ కావాలని చేయలేదని, దాని వెనుక తనకెలాంటి చెడు ఉద్దేశాలు లేవని తెలిపాడు.
By: Tupaki Desk | 24 Feb 2025 11:30 PM GMTమజాకా ప్రమోషన్స్ టైమ్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన హీరోయిన్ అన్షుపై చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట జరిగిన ఈ వివాదంపై త్రినాథరావు మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అన్షుని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ కావాలని చేయలేదని, దాని వెనుక తనకెలాంటి చెడు ఉద్దేశాలు లేవని తెలిపాడు.
ఆ రోజు ఈవెంట్ కు వచ్చిన వారిని నవ్వించే ఉద్దేశంలో తన నోటి నుంచి ఆ మాట జారింది తప్ప కావాలని అన్షుపై కామెంట్స్ చేయలేదని కావాలని చేస్తే తప్పు చేసినట్టవుతుందని, తాను అనుకోకుండా అలా మాట్లాడినప్పటికీ తప్పు చేసినట్టే భావించానని, స్టేజ్ పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని తర్వాత అనిపించిందని త్రినాథరావు తెలిపాడు.
అందుకే తర్వాత అందరికీ సారీ చెప్పానని, ఈ విషయంలో అసలేం జరిగిందనేది అన్షుకు తెలియదని, తనకు ఫోన్ చేసి ఏమైందో అడిగిందని, విషయం మొత్తం చెప్పాక అన్షు అర్థం చేసుకుందని చెప్పిన త్రినాథరావు, ఈ విషయంలో అందరికంటే తన తల్లి చాలా ఎక్కువ బాధ పడినట్టు తెలిపాడు. ఇన్నేళ్లు కష్టపడి డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుని ఎందుకు నోరు జారావని ప్రశ్నించిందని ఆయన చెప్పాడు.
నువ్వు ఒక్క పదం నోరు జారడం వల్ల ఇవాళ అందరూ నిన్ను దుర్మార్గుడిని చేశారు. నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలిసినా అందరికీ చెప్పలేను కదా, ఇక మీదట అయినా స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా వాడమని తల్లి తనకు చెప్పిందని, ఈ విషయంలో దాదాపు వారం రోజుల పాటూ ఆమె బాధ పడిందని, అది చూసి ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని డిసైడ్ అయినట్టు త్రినాథరావు చెప్పాడు.
సందీప్ కిషన్ హీరోగా, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మజాకా సినిమా మజాకా ప్రమోషన్స్ లో భాగంగా త్రినాథరావు నక్కిన ఈ విషయాన్ని చెప్పాడు. మజాకా మూవీ శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ పై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.